న్యూఢిల్లీ, అక్టోబర్ 16: దేశంలో విమానాలకు వరుసగా వస్తున్న బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. గత మూడు రోజుల్లో 19 విమానాలకు బెదిరింపులు వచ్చాయి. బెదిరింపుల కారణంగా బుధవారం రియాద్ వెళ్లే ఇండిగో విమానాన్ని మస్కట్‌కు దారి మళ్లించారు. 177 మంది ప్రయాణికులతో బెంగళూరు వెళ్లాల్సిన ఆకాశ ఎయిర్‌లైన్స్ విమానం ఢిల్లీ నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే బాంబు బెదిరింపు రావడంతో తిరిగి ఢిల్లీకి రప్పించారు. అలాగే ఇండిగోకు చెందిన ముంబై-ఢిల్లీ ఫ్లైట్‌కు కూడా ఇలాంటి బెదిరింపే రావడంతో అహ్మదాబాద్‌కు మళ్లించి ల్యాండ్ చేశారు. ఇదే విధంగా మంగళవారం ఏడు విమానాలకు, సోమవారం మూడు విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర ఆందోళన చెందారు. బాంబు బెదిరింపులకు సంబంధించి 17 ఏండ్ల బాలుడితో పాటు కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎయిర్‌మార్షల్స్ రెట్టింపు!
విమాన బెదిరింపుల ఘటనలు పెరిగిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఈ విషయంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశమై చర్చించింది. అంతకుముందు పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు డీజీసీఏ, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఇప్పటివరకు 30 వరకు ఇలాంటి బాంబు బెదిరింపులు రాగా, 11 విమానాలపై వాటి ప్రభావం పడినట్టు అధికారులు తెలిపారు. విమానాలలో ఎయిర్ మార్షల్స్ సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. కొన్ని అంతర్జాతీయ, సున్నితమైన దేశీయ రూట్లలో ఎన్ఎస్జీ కమాండోలను ఎయిర్మార్షల్స్గా ఉంచనున్నారు. విమానాశ్రయాలలో భద్రతను పెంచనున్నారు.
17 ఏండ్ల బాలుడి అరెస్ట్
కాగా, విమానాల్లో బాంబులు ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్పడ్డ 17 ఏళ్ల మైనర్‌ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారస్తుడైన అతని తండ్రికి సమన్లు జారీ చేసి ప్రశ్నిస్తున్నారు. తన స్నేహితుడితో డబ్బు విషయంపై జరిగిన వివాదంతో అతనిపై కక్ష తీర్చుకోవడానికి ఛత్తీస్‌గఢ్ రాజ్నంగ్గావ్కు చెందిన ఈ బాలుడు అతని పేరుపై నకిలీ ఎక్స్ ఖాతా సృష్టించి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. సోమవారం ఈ బాలుడు చేసిన బెదిరింపుల వల్ల నాలుగు విమానాలకు అంతరాయం ఏర్పడింది.