Taj Mahal | తాజ్ మహల్‌ను బాంబులతో పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజ్ మహల్ వద్దకు బాంబ్ డిస్పోజల్ టీమ్‌లను, డాగ్ స్క్వాడ్స్‌ను రంగంలోకి దింపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజ్ మహల్‌ను పేల్చివేస్తామని బెదిరింపు ఇ-మెయిల్ వచ్చిందని ఆగ్రా డీసీపీ సూరజ్ రాయ్ తెలిపారు. ప్రస్తుతం పర్యాటకులను బయటకు పంపి.. పోలీసు బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయితే, ఇ-మెయిల్ ఎవరు పంపారు? ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు తాజ్ మహల్ వద్ద ఎలాంటి అనుమానాస్పద వస్తువులను గుర్తించలేదని పోలీసులు అధికారులు పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ పర్యాటక విభాగానికి మంగళవారం ఇ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ఈ మేరకు అధికారులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. తాజ్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నట్లు ఏసీపీ తాజ్ సెక్యూరిటీ సయ్యద్ అరీబ్ అహ్మద్ తెలిపారు. బాంబు బెదిరింపు వట్టిదేనన్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, పోలీసుల బృందాలను రంగంలోకి దింపి తనిఖీలు నిర్వహించామని.. అనుమానాస్పద వస్తువులు దొరకలేదని అరీబ్ అహ్మద్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో బెదిరింపులు పెరిగిన విషయం తెలిసిందే. విమానాలు, విమానాశ్రయాలు, పాఠశాలలకు ఇటీవల వరుసగా బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది నవంబర్ 13 వరకు దేశీయ విమానాయాన సంస్థలకు దాదాపు 1,143 బాంబు బెదిరింపులు వచ్చాయని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ రాజ్యసభకు తెలిపారు. బెదిరింపులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.