బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 16, 2020 , 03:17:33

అసమ్మతి దేశద్రోహం కాదు!

అసమ్మతి దేశద్రోహం కాదు!
  • అది ప్రజాస్వామ్యానికి రక్షణ ఛత్రం
  • అసమ్మతివాదులపై జాతివ్యతిరేక ముద్ర.. రాజ్యాంగంపై దాడే
  • సుప్రీంకోర్టు న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ వ్యాఖ్య

అహ్మదాబాద్‌, ఫిబ్రవరి 15: అసమ్మతి దేశద్రోహం కాదని, అది ప్రజాస్వామ్యానికి రక్షణ ఛత్రం వంటిదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పేర్కొన్నారు. అసమ్మతివాదులపై జాతివ్యతిరేకులుగా ముద్రవేయడం రాజ్యాంగ విలువలపై, ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడిచేయడంతో సమానమని వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శనివారం నిర్వహించిన ‘జస్టిస్‌ పీడీ దేశాయ్‌ స్మారక 15వ ఉపన్యాస’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘ద హ్యూస్‌ దట్‌ మేక్‌ ఇండియా: ఫ్రం ప్లూరాలిటీ టు ప్లూరలిజం’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ వ్యతిరేక స్వరాలు వినిపించే గొంతుకలను బలవంతంగా మూయించడం దేశ బహుళత్వానికి పెద్దముప్పుగా పరిణమిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలోనే జస్టిస్‌ చంద్రచూడ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. సీఏఏ నిరసనల్లో ఆస్తుల విధ్వంసానికి సంబంధించి యూపీ సర్కారు ఆందోళనకారుల నుంచి సొమ్ము రికవరీ చేయడంపై దాఖలైన వ్యాజ్యాలను విచారిస్తున్న ధర్మాసనంలో చంద్రచూడ్‌ భాగస్వామి. ఆయన ప్రసంగంలోని ప్రధానాంశాలు.. 


అణచివేత చట్టవిరుద్ధం 

అసమ్మతిని అణచివేయడం అంటే రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికపరంగా, సామాజికంగా అభివృద్ధిని అడ్డుకోవడమే. ప్రశ్నించేతత్వాన్ని, అసమ్మతిని అణగదొక్కడానికి అధికార యంత్రాంగాన్ని వినియోగించి భయాన్ని సృష్టించడం, ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుంది. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను, వాక్‌ స్వాతంత్య్రాన్ని కాపాడేందుకే అధికార యంత్రాంగాన్ని వినియోగించాల్సి ఉంటుంది. అసమ్మతివాదులపై ఏకపక్షంగా దేశద్రోహులుగా, ప్రజాస్వామ్య వ్యతిరేకులుగా ముద్రవేయడం అనేది రాజ్యాంగ విలువలను కాపాడుతామన్న మన నిబద్ధతపై దాడిచేయమే. ఇది ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను, వాక్‌ స్వాతంత్య్రాన్ని ఉల్లంఘించినట్టే. అసమ్మతి గళాలను పరిరక్షించడమంటే.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ప్రభుత్వం అభివృద్ధి, సమా జ సమన్వయం కోసం మనకు ఒక చట్టబద్ధమైన ఆయుధాన్ని అందించినట్టు అవుతుంది. 


ప్రజాస్వామ్యానికి అసలైన పరీక్ష 

ప్రజాస్వామ్య వ్యవస్థకు చర్చలు, భిన్న వాదనలే ప్రాణం. దేశంలోని ప్రతి వ్యక్తి తన వాదనను స్వేచ్ఛగా, బలంగా వినిపించే వాతావరణాన్ని కల్పించడమే ప్రజాస్వామ్యానికి అసలైన పరీక్ష. ప్రజాస్వామ్యాన్ని మనం ఏర్పాటుచేసుకున్న వ్యవస్థలు మాత్రమే నిర్వచించలేవు. సమాజం నుంచి వచ్చే భిన్న స్వరాలను గుర్తించడం, వాటికి విలువ ఇవ్వడం, స్పందించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని గుర్తించవచ్చు. ఆదర్శవంతమైన సమాజం మైనార్టీ వర్గాల అభిప్రాయానికి విలువ ఇస్తుంది. ఆ సమాజం నుంచి వెలువడే ప్రతి నిర్ణయం ఏకాభిప్రాయంగా ఉంటుంది. భిన్న వాదనలకు రాజ్యాంగబద్ధత ఉన్నది. దీనికి పరిరక్షించడానికి ప్రభుత్వాలు కృషిచేయాలి. ఇతరుల మనోభావాలను, అభిప్రాయాలను మనం గౌరవించాలి. 


బహుళత్వానికి ముప్పు 


ప్రభుత్వ వ్యతిరేక స్వరాలు వినిపించే నోళ్లను బలవంతంగా మూయించడం, అసమ్మతిని అణచివేయడం దేశ బహుళత్వానికి పెద్దముప్పుగా పరిణమిస్తాయి. మన దేశంలో బహుళత్వం అనే భావన.. భిన్న రాష్ర్టాలు, జాతులు, భాషలు, నమ్మకాల సమ్మేళనం అన్నదానిని, వాటిని పరిరక్షించే నిబద్ధతను నొక్కి చెప్తుంది. మేధస్సును అణచివేయడం మనస్సాక్షిని లేదా దేశాన్ని అణగదొక్కడంతో సమానం. జాతీయ ఐక్యత అనేది భాగస్వామ్య సాంస్కృతిక విలువలను సూచిస్తుంది. అంతేకాకుండా దేశంలోని ప్రతి వ్యక్తికి ప్రాథమిక హక్కులతోపాటు స్వేచ్ఛ, భధ్రత కల్పిస్తామన్న రాజ్యాంగ మూల సూత్రానికి అది నిదర్శనంగా నిలుస్తుంది. భిన్న సంస్కృతులకు, వైవిధ్యానికి, అసమ్మతికి చోటివ్వడం ద్వారా దేశం నిరంతరం మార్పులు చెందుతున్నదని, ‘ఈ దేశం ప్రతి ఒక్కరిది’ అన్న భావనను పెంపొందిస్తున్నామని పునరుద్ఘాటించినట్టు అవుతుంది’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ చెప్పారు.


ఈ దేశం అందరిదీ 

‘దేశం అనే భావనపై ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ గుత్తాధిపత్యాన్ని పొందలేదు. హిందూ దేశం లేదా ముస్లిం దేశం అన్న భావనను మన రాజ్యాంగ నిర్మాతలు తిరస్కరించారు. వారు మన దేశాన్ని ‘గణతంత్ర రాజ్యం’గా మాత్రమే నిర్వచించారు. భవిష్యత్తు తరాల వారు భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటిస్తూ ‘మనమంతా భారతీయులం’ అనే భావనతో కలిసిమెలిసి ఉంటారని మన పూర్వీకులు నమ్మారు. భారతీయతకు సజాతీయత అనేది నిర్వచనం కాదు. మన వైవిధ్యం మన బలహీనత కాదు. సమాజంలో భిన్నత్వాన్ని గుర్తిస్తూనే ఏకత్వ భావనను పెంపొందించుకునే సామర్థ్యమే మన బలానికి మూలం. వైవిధ్యానికి భారతదేశం నిలయం. మన దేశ మనుగడ అనేది శరీరం రంగు, మాట్లాడే భాష, పూజించే దేవుళ్లకు అతీతంగా సంతోషమయ జీవితాన్ని కోరుకుంటున్నామని చాటిచెప్తుంది’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ పేర్కొన్నారు.


logo