న్యూఢిల్లీ: దేశంలోని జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో వేలాది మంది దుర్మరణం చెందుతున్నారు. ఈ ఏడాది జూలై 17 వరకు ఈ తరహా ప్రమాదాల్లో 26,770 మంది చనిపోయారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల పార్లమెంట్లో ఎంపీ శశ్మిత్ పాత్రా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత రెండేండ్లలో ఏటా 50 వేలకు పైగా మరణాలు జాతీయ రహదారులపై సంభవించాయి. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ప్రమాదాలకు అవకాశమున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి వాటిని సరిదిద్దడంపై కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ దృష్టి సారించింది. ఇప్పటివరకు 8,542 బ్లాక్ స్పాట్లకు స్వల్ప కాలిక మరమ్మతులు, 3,144 చోట్ల దీర్ఘ కాల మరమ్మతులు చేశారు.
దీర్ఘ కాలిక రోడ్డు సవరణల్లో రోడ్డు జ్యామితి మెరుగుదల, కూడళ్ల పునః రూపకల్పన, క్యారేజ్ వే విస్తరణ, అండర్ పాస్, ఓవర్ పాస్‌ల నిర్మాణం ఉంటాయని మంత్రి తెలిపారు. ఇందుకు భూ సేకరణ, అటవీ అనుమతుల వంటివి అవసరం కావడంతో సహజంగానే పనుల పూర్తికి గణనీయైన సమయం పడుతుందని తెలిపారు. హైవేలపై ప్రమాదాల నివారణకు ఏఐ ఆధారిత అత్యాధునిక ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలు(ఏటీఎమ్స్), వీడియో సంఘటన గుర్తింపు, అమలు వ్యవస్థలు(వైడ్స్) అమలు చేస్తున్నట్టు చెప్పారు.