న్యూఢిల్లీ: భారత దేశం నుంచి ఏటా వేలాది మంది కోటీశ్వరులు విదేశాలకు తరలిపోతున్నారు. అక్కడ ఉన్న సరళీకృత పన్ను విధానాలు, ఇతర ప్రయోజనాలు వారిని ఆకర్షిస్తున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశమైనప్పటికీ వీరి సంఖ్య ప్రతి ఏడాది తగ్గుతూ వస్తుండటం ఊరటనిచ్చే అంశం. హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ తాజా నివేదిక ప్రకారం ఈ ఏడాది 3,500 మంది అధిక నికర విలువ గల వ్యక్తులు(హెచ్ఎన్డబ్ల్యూఐ) విదేశాలకు తరలివెళ్లే అవకాశం ఉందని అంచనా. ఇలాంటి వారి సంఖ్య 2024లో 4300, 2023 5,100గా నమోదైంది. సంఖ్యాపరంగా ఇది తగ్గుదలను సూచించినప్పటికీ ఆర్థిక ఉపసంహరణ స్థాయి గణనీయంగా ఉంది.
నివేదిక అంచనా ప్రకారం రూ.2.19 లక్షల కోట్లను పెట్టుబడి పెట్టదగిన సంపద దేశం నుంచి బయటకు వెళ్లనుంది. విదేశాలకు తరలి వెళుతున్న సంపన్నుల కనీస ఆస్తుల విలువ 1 మిలియన్ డాలర్లుగా అంచనా. అదే సమయంలో 2014-2024 మధ్య భారత దేశంలో లక్షాధికారుల సంఖ్య 72 శాతం పెరిగింది. ధనవంతుల వలసలు ఉన్నా భయపడాల్సిన అవసరం లేదని, బలమైన సంపద సృష్టించే శక్తి కొత్తగా లక్షాధికారులు అయినవారికి ఉందని ఆ నివేదిక సూచిస్తున్నది. అయితే వలసలు తగ్గుముఖం పట్టడానికి గల కారణాలను విశ్లేషిస్తే దేశీయంగానే అవకాశాలు మెరుగు కావడమేనని భావిస్తున్నారు. అయినప్పటికీ విదేశాలకు సంపద తరలింపు సాగుతున్న అగ్రదేశాలలో ఒకటిగా భారత్ కొనసాగుతున్నది. మొబైల్ కేపిటల్‌ను ఎక్కువగా ఆకర్షిస్తున్న దేశాలో యూఏఈ, అమెరికా, ఇటలీ, స్విట్జర్లాండ్, సౌదీ అరేబియా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది యూఏఈ 9,800 మంది కొత్త మిలియనీర్లను ఆకర్షిస్తుందని అంచనా.