Tax | న్యూఢిల్లీ: భారత్లో ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ధనవంతులపై ఎక్కువ పన్నులు విధించాలని ఫ్రెంచ్ ఆర్థికవేత్త, ‘కాపిటల్ ఇన్ ది ట్వెంటీ ఫస్ట్ సెంచరీ’ పుస్తక రచయిత థామస్ పికెట్టి సూచించారు. రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
భారతదేశంలోని రూ.10 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న సంపన్నులపై 2 శాతం సంపద పన్ను విధిస్తే దేశ జీడీపీలో 2.73 శాతానికి సమానమైన వార్షిక ఆదాయం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రూ.10 కోట్ల పైన విలువైన ఆస్తులపై 33 శాతం వారసత్వ పన్నును కూడా విధించాలని ఆయన సూచించారు.
2022-23లో జాతీయ ఆదాయంలో 22.6 శాతం వాటా దేశంలోని అత్యంత సంపన్నులైన 1 శాతం జనాభాదేనని, దేశం మొత్తం సంపదలో 40.1 శాతం వారి వద్దే ఉందని ఆయన పేర్కొన్నారు. భారతదేశ జాతీయ ఆదాయంలో అత్యంత ధనికులైన 1 శాతం మంది వాటా విలువ అమెరికా, బ్రెజిల్లలోని 1% ధనికుల వాటాను మించిపోయిందని ఆయన అన్నారు. అయితే, పికెట్టి సూచనను ఇదే కార్యక్రమంలో పాల్గొన్న భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ వ్యతిరేకించారు.
కాగా, భారత ప్రభుత్వం 2015లో సంపద పన్నును రద్దు చేసింది. వారసత్వ పన్నును తీసుకురావాలనే ప్రతిపాదనలను ప్రభుత్వం తిరస్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పన్ను విధించబోమని ఏప్రిల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.