న్యూఢిల్లీ : హెచ్-1బీ వీసా దరఖాస్తుల వార్షిక రుసుమును 1 లక్ష డాలర్లకు పెంచడం వల్ల డిగ్రీ, పీజీ చదివిన విద్యార్థులు; మన దేశం నుంచి అమెరికాకు ఉద్యోగం కోసం వెళ్లాలనుకునేవారు, ప్రస్తుత వీసాను రెన్యువల్ చేసుకోవలసినవారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అమెరికన్ కంపెనీలు హెచ్-1బీ వీసాలపై నియమించుకున్న ఇండియన్ టెక్ ప్రొఫెషనల్స్‌పై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
అమెరికన్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ మాట్లాడుతూ, వీసాల రెన్యువల్ లేదా కొత్తగా నియామకాలు చేపట్టడంపై కంపెనీలే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఓ ఉద్యోగి కోసం సంవత్సరానికి 1 లక్ష డాలర్లు ప్రభుత్వానికి చెల్లించడం అవసరమేనా? అమెరికన్ పౌరుడినే నియమించుకోవాలా? అనే అంశంపై కంపెనీలే నిర్ణయించుకోవాలన్నారు. సంవత్సరానికి 1 లక్ష డాలర్లు చొప్పున ఆరేళ్లపాటు చెల్లించవలసి ఉంటుందని చెప్పారు.