లక్నో: దేశ వ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఉత్తర ప్రదేశ్లోని ఒక గ్రామం మాత్రం దసరా వేడుకలకు దూరంగా ఉన్నది. రామ్ లీలా వేడుకలు, రావణుడి దిష్టి బొమ్మల దహనం ఇక్కడ జరుగవు. ఎందుకంటే రావణాసురుడి వారసులుగా ఆ గ్రామస్తులు చెప్పుకుంటారు. దేశ రాజధాని ఢిల్లీకి 33 కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్ గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో బిస్రాఖ్ గ్రామం ఉంది. ఈ గ్రామస్తులు ఈ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్నింటిలో సాధారణంగా ఉంటారు. రాక్షస రాజు రావణాసురుడ్ని వారు ఆరాధిస్తారు. సుమారు 5,500 మంది గ్రామస్తులు రావణుడి వారసులుగా చెప్పుకుంటారు. రావణుడి తండ్రి, ప్రసిద్ధ ఋషి అయిన విశ్రవస్ పేరు నుంచి తమ గ్రామానికి బిస్రాఖ్ పేరు వచ్చిందని వారు నమ్ముతారు.
గ్రామం మధ్యలో ఉన్న శివాలయాన్ని బిస్రాఖ్ రావణ దేవాలయంగా పిలుస్తారు. రావణుడు, ఆయన వారసులు ఈ ఆలయంలో పూజలు చేసినట్లు గ్రామస్తులు నమ్ముతారు. రావణుడి తాత పులస్త్య ఈ శివలింగాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్లు గ్రామస్తులు చెబుతారు. ఇక్కడ రావణుడి గుడి కూడా ఉంది. ఆ ఆలయంలోని రావణుడితోపాటు మిగతా దేవతలకు కూడా గ్రామస్తులు పూజలు చేస్తుంటారు. దేవుడైన రాముడితోపాటు తమ గ్రామ వారసుడైన రావణుడ్ని కూడా తాము ఆరాధిస్తామని గ్రామస్తులు వెల్లడించారు.
మరోవైపు 2014లో 2 కోట్ల వ్యయంతో రావణుడి ఆలయం నిర్మించాలని భావించిన గ్రామస్తులు గ్రేటర్ నోయిడా పాలక మండలికి ప్రతిపాదన పంపారు. అయితే భజరంగ్ దళ్ దీనిని అడ్డుకున్నది. రెండేళ్ల తర్వాత యోగా గురువు అశోకానంద ఈ గ్రామంలోని తన ఆశ్రమంలో రావణుడి విగ్రహాన్ని ప్రతిష్టించగా రాత్రికి రాత్రే కొందరు ధ్వంసం చేశారు. భజరంగ్ దళ్ పనేనని గ్రామస్తులు ఆరోపించారు. తాము రావణుడ్ని ఆరాధిస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ ఆ గ్రామస్తులు మండిపడుతున్నారు.
కాగా, దసరా రోజున రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తే తమకు అరిష్టం జరుగుతుందని బిస్రాఖ్ గ్రామస్తుల నమ్మకం. దీనిపై ఆ గ్రామంలో చాలా కథలున్నాయి. ఒకసారి గ్రామానికి చెందిన ఒక కుటుంబం రావణుడి బొమ్మను దహనం చేసిందని, మరునాడు ఆ కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చనిపోయారని ఒక గ్రామస్తుడు తెలిపాడు. అందుకే గత 30 ఏళ్లుగా గ్రామంలో రామ్ లీలా నిర్వహించరని, అలాగే రావణుడి దిష్టిబొమ్మల దహనానికి దూరంగా ఉంటామని చెప్పాడు.
ఈ గ్రామంలోని పలు షాపులకు రావణుడి పేర్లు ఉంటాయి. రావణ డీజే పేరుతో మ్యూజిక్ షాప్ కూడా ఉంది. పది తలలున్న రావణాసురుడి టీ షర్టులు కూడా గ్రామస్తులు ధరిస్తుంటారు. అలాగే వాహనాలపైనా, లోపల కూడా రావణుడి బొమ్మలు, చిత్రాలు ఉంచుతారు.