Akhilesh Yadav : ఈ లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో సైకిల్ (సమాజ్వాది పార్టీ ఎన్నికల గుర్తు) దే జోరని, దాన్ని ఎవరూ అడ్డుకోలేరని యూపీ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తంచేశారు. గత లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలను బీజేపీ తుంగలో తొక్కిందని, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు.
రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని హామీ ఇచ్చారని, పదేళ్లు పాలించినా రెండింతలు కాలేదని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. దేశంలో పేదలకు రేషన్ కూడా సరిగా అందడం లేదని ఆరోపించారు. రైతుల పంట రుణాలను కూడా కేంద్ర ప్రభుత్వం మాఫీ చేయలేకపోతున్నదని, కానీ పారిశ్రామికవేత్తల రుణాలను మాత్రం మాఫీ చేస్తున్నదని ఎద్దేవా చేశారు.
దేశంలో 80 శాతం యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోయారని అఖిలేష్ యాదవ్ అన్నారు. ఏ పరీక్ష జరిగినా పేపర్లు లీకవుతున్నాయని ఆరోపించారు. వీటిలో దేనికి కూడా ప్రభుత్వం దగ్గర సమాధానం లేదని విమర్శించారు. యూపీలో ఈసారి సైకిల్దే జోరని, దాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తంచేశారు.