న్యూఢిల్లీ: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఇది శుభవార్తే. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ తరహాలో ఎల్పీజీ డీలర్‌ను కూడా మార్చుకునే వెసులుబాటు త్వరలోనే రానుంది. ఇందుకు సంబంధించి పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్జీఆర్బీ) కీలకమైన ముసాయిదాను ప్రతిపాదించింది. సిలిండర్ సరఫరాలో ఆలస్యం, ఇతర సేవలపై ఫిర్యాదులు దేశవ్యాప్తంగా పెరుగుతుండటంతో ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు కొత్తగా ఇంటర్ ఆపరేటబిలిటీ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం వినియోగదారులు ఒకే చమురు కంపెనీ పరిధిలోని వేర్వేరు డీలర్లకు మాత్రమే మారవచ్చు. ఉదాహరణకు ఇండేన్ వినియోగదారులు తమ పరిధిలోని మరో ఇండేన్ డీలర్‌కు మాత్రమే మారే వెసులుబాటు ఉం ది. అంతేకానీ, భారత్ గ్యాస్‌కు మారలేరు. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ఈ పరిమితి తొలగిపోతుంది. సేవల పరంగా వినియోగదారుడికి స్వేచ్ఛ లభిస్తుంది. త్వరలోనే దీని అమలు తేదీని ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది.