Rajiv Pratap Rudy : ప్రజాసేవలో బిజీగా ఉండే రాజకీయ నాయకులు అప్పుడప్పుడు తమలో ఉన్న ప్రతిభకు కొంత సమయం కేటాయిస్తుంటారు. తాజాగా బీజేపీ (BJP) కి చెందిన బీహార్ (Bihar) ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ (Rajiv Pratap Rudy) కో పైలట్‌గా మారారు. దీనిపై రూడీని ప్రశంసిస్తూ కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. పట్నా నుంచి ఢిల్లీకి వెళ్లే విమానంలో మంత్రి చౌహాన్ ప్రయాణించారు. ఈ క్రమంలో విమానంలో కోపైలట్‌గా ఉన్న రూడీని చూసి ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించి చౌహాన్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘రాజీవ్ ఈ రోజు మీరు మా హృదయాలను గెలిచారు. పట్నా నుంచి ఢిల్లీకి వెళ్లే ఈ ప్రయాణం నాకు మరవలేనిది. ఎందుకంటే ఈ విమానానికి నా ప్రియమైన స్నేహితుడు, ఛప్రా ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ కోపైలట్‌గా ఉన్నారు’ అని చౌహాన్ రాసుకొచ్చారు.
విమానంలో రూడీతో మాట్లాడుతున్న ఫొటోతోపాటు రూడీని ప్రశంసిస్తూ చేతితో రాసిన లేఖను కూడా చౌహాన్ పంచుకున్నారు. అందులో రూడీపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదని, బిజీ షెడ్యూల్లు ఉన్నప్పటికీ తమలో ఉన్న ప్రతిభ కోసం సమయం కేటాయిస్తారని పొగిడారు. తన ప్రయాణాన్ని చిరస్మరణీయంగా మార్చినందుకు రూడీకి కృతజ్ఞతలు తెలిపారు.