Bihar : బిహార్‌లో ఒక పెంపుడు కుక్క నోటికి టేప్ అంటించి దొంగలు చోరీకి పాల్పడ్డారు. బారీ ఎత్తున నగలు, నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన బిహార్, ఔరంగాబాద్ జిల్లా, ముఫ్ఫసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భర్వార్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్వార్ గ్రామంలో అలోక్ సింగ్ ఇల్లు ఊరి మధ్యలోనే ఉంటుంది. శుక్రవారం రాఖీ పండుగ కావడంతో అలోక్ సింగ్ కొడుకులు.. వారి సోదరి ఇంటికి వెళ్లారు.
తల్లిదండ్రులు, బంధువులు వేరే ఇంటిలో ఉంటున్నారు. దీంతో శుక్రవారం ఇంట్లో అలోక్ సింగ్, అతడి భార్య మాత్రమే ఉన్నారు. పైగా రాత్రి వారిద్దరూ వేర్వేరు గదుల్లో పడుకున్నారు. రాత్రి బాగా వర్షం పడింది. దీంతో ఎవరి ఇంట్లో వాళ్లు ఉండిపోయారు. ఈ క్రమంలో అర్ధరాత్రి ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. అరుగు మీద ఉన్న పెంపుడు కుక్క అరవకుండా నోటికి టేప్ అంటించారు. దీంతో కుక్క నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇంట్లో దొంగతనానికి శబ్దాలు వినిపించకుండా కూలర్ ఆన్ చేశారు. అది భారీ శబ్దం చేసింది. ఇటు వర్షం సౌండ్.
దీంతో లోపలి గదుల్లో నిద్రపోతున్న వారికి ఇంట్లో ఏం జరుగుతుందో తెలియరాలేదు. దొంగలు వివిధ గదుల తాళాలు పగులగొట్టి, ఇంట్లోని దాదాపు రూ.4 లక్షల వరకు విలువైన బంగారం, రూ.40,000 నగదు ఎత్తుకెళ్లారు. ఉదయం ఆ దంపతులు తీరిగ్గా లేచేసరికి, ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ చోరీ జరిగిన విధానం చూస్తుంటే పక్లా ప్లాన్‌తోనే జరిగినట్లు అనిపిస్తోంది.