బక్సర్: బీహార్లోని బక్సర్ జిల్లాలో వింత చోరీ వెలుగు చూసింది. దుమ్రావ్లో ఏర్పాటు చేసిన 132 అడుగుల టవర్, దానితో పాటు 15 కేవీఏ జనరేటర్, ఇతర పరికరాలు మాయమయ్యాయి. జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉద్యోగులు మరమ్మతు పనుల కోసం అక్కడికి చేరుకున్నప్పుడు టవర్ లేకపోవడాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్థానికుల కథనం ప్రకారం ఆ మొబైల్ టవర్ గత 15 ఏండ్లుగా అక్కడే ఉంది. అయితే ఇటీవల దానిని అధికారికంగానే తొలగించారని తాము అనుకున్నామన్నారు.
ఈ విషయమై ఎస్పీ శుభమ్ ఆర్య మాట్లాడుతూ ఆ టవర్ను చట్టబద్ధంగానే తొలగించారా లేక అక్రమంగా తరలించారా అనే విషయమై దర్యాప్తు జరుగుతున్నదన్నారు. స్థల యజమాని తెలిపిన వివరాల ప్రకారం 2010లో తన స్థలంలో టవర్ ఏర్పాటుకు ఆ కంపెనీతో 12 ఏండ్ల ఒప్పందం కుదిరిందని, అది 2022తో ముగిసిందన్నారు.