లక్నో, జూన్ 3: డాక్టర్ ఇంట్లో చొరబడిన దొంగ ఏసీ వేసుకొని హాయిగా గుర్రుకొట్టి మరీ నిద్రపోయాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఆదివారం చోటుచేసుకున్నది. లక్నోలోని ఇందిరానగర్‌లో ఓ తాళం వేసిన ఇంట్లోకి శనివారం రాత్రి ఓ దొంగ చొరబడ్డాడు.
మద్యం మత్తులో ఉన్న అతడు ఏసీ వేసుకొని తలకింద దిండు పెట్టుకొని హాయిగా గుర్రుకొట్టి నిద్రపోయాడు. ఉదయం ఇంటి గేటు తెరిచి ఉండటంతో పొరుగింటివారు ఆ ఇంటి యజమాని డాక్టర్ సునీల్పాండేకు ఫోన్‌చేశారు. దొంగ ఇంట్లో దూరిన సమయంలో ఆయన వారణాసిలో విధుల్లో ఉన్నారు. పాండే ఫిర్యాదు మేరకు పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా, దొంగ హాయిగా ఫోన్చేతిలో పట్టుకొని గాఢనిద్రలో ఉన్నాడు. పోలీసులు అతడిని నిద్రలేపి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.