బెంగళూరు: ఒక దొంగ దోచుకున్న కోట్ల డబ్బుతో ప్రముఖ సినీ నటి అయిన ప్రియురాలికి లగ్జరీ ఇల్లు కట్టించాడు. (Thief Builds House For Actress Girlfriend) అలాగే రూ.22 లక్షల విలువైన అక్వేరియంను బహుమతిగా ఇచ్చాడు. ఒక చోరీ కేసులో ఆ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఘరానా దొంగ వివరాలు తెలుసుకుని షాక్ అయ్యారు. జనవరి 9న బెంగళూరులోని మడివాలా ప్రాంతంలోని ఒక ఇంట్లో చోరీ జరిగింది. దర్యాప్తు చేసిన పోలీసులు దొంగతనం చేసిన 37 ఏళ్ల పంచాక్షరి స్వామిని అరెస్ట్ చేశారు. అతడ్ని ప్రశ్నించగా విస్తూ పోయే విషయాలు తెలిశాయి.
కాగా, మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన పంచాక్షరి స్వామి 2003లో మైనర్ బాలుడిగా ఉన్నప్పటి నుంచే నేరాల బాటపడ్డాడు. 2009 నాటికి దొంగతనాల్లో ఆరితేరాడు. నేరాల ద్వారా కోట్ల సంపదను కూడబెట్టాడు. పెళ్లై ఒక బిడ్డ ఉన్న అతడు పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగించాడు. 2014-15 మధ్య ప్రముఖ సినీ నటితో పరిచయం పెంచుకున్నాడు. ప్రియురాలైన ఆ నటి కోసం కోట్లు ఖర్చు చేశాడు. కోల్‌కతాలో రూ.3 కోట్ల విలువైన లగ్జరీ ఇంటిని ఆమె కోసం నిర్మించాడు. అలాగే రూ.22 లక్షల విలువైన అక్వేరియంను ఆ నటికి బహుమతిగా ఇచ్చినట్లు పోలీసులకు చెప్పాడు.
మరోవైపు 2016లో పంచాక్షరి స్వామిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరేళ్లు జైలు శిక్ష అనుభవించిన అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ తర్వాత పలు చోరీలకు పాల్పడటంతో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. 2024లో విడుదలైన స్వామి, తన స్థావరాన్ని కర్ణాటకకు మార్చాడు. జనవరి 9న ఒక ఇంట్లో దొంగతనం చేసిన అతడ్ని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే దొంగిలించిన బంగారం, వెండిని కరిగించి బిస్కెట్లుగా స్వామి మార్చేవాడని పోలీసులు తెలుసుకున్నారు. సోలాపూర్‌లోని అతడి ఇంట్లో తనిఖీ చేశారు. 181 గ్రాముల బంగారు బిస్కెట్లు, 333 గ్రాముల వెండి వస్తువులు, బంగారాన్ని కరిగించడానికి ఉపయోగించే ఫైర్ గన్ను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ఘరానా దొంగ పంచాక్షరి స్వామి కరాటేలో బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. తండ్రి మరణాంతరం అతడి తల్లికి రైల్వేలో ఉద్యోగం వచ్చిందని చెప్పారు. తల్లి పేరు మీద అతడికి ఒక ఇల్లు కూడా ఉందన్నారు. అయితే నేరాల్లో కోట్లు గడించిన అతడు ఆ ఇంటి రుణం చెల్లించకపోవడంతో బ్యాంకు వేలం నోటీస్ జారీ చేసిందని వివరించారు. స్వామి చోరీలపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.