న్యూఢిల్లీ: ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో కేవలం అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలు మాత్రమే ఉంటాయని, సీఎం ఫోటోలను ఆఫీసుల్లో పెట్టనివ్వమని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రేపు జరగబోయే గణతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఇవాళ ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఇక నుంచి ప్రభుత్వ ఆఫీసుల్లో సీఎం కానీ రాజకీయవేత్తల ఫోటోలను పెట్టబోమన్నారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్యను అందించాలన్న అంబేద్కర్ స్వప్నాలను నిజం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. గడిచిన ఏడేళ్లలో విద్యావ్యవస్థలో సంస్కరణలు చేపట్టినట్లు కేజ్రీ చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానీయా ట్రంప్ కూడా తమ స్కూళ్లను విజిట్ చేసిందని, ప్రభుత్వ బడులకు సర్టిఫికేట్ కూడా వచ్చిందన్నారు. ఢిల్లీలో సాధారణ పరిస్థితులను ఏర్పరిచేందుకు ప్రయత్నిస్తామన్నారు. గడిచిన 10 రోజుల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు 20 శాతం తగ్గిందని, జనవరి 15న 30 శాతం ఉన్న ఆ రేటు ఇవాళ 10 శాతానికి పడిపోయిందన్నారు. వ్యాక్సినేషన్ వల్ల ఆ పాజిటివిటీ రేటు అదుపులోకి వచ్చినట్లు సీఎం చెప్పారు.