న్యూఢిల్లీ, అక్టోబర్ 17: జేఈఈ మెయిన్ పరీక్ష విధానంలో కీలక మార్పు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) గురువారం ప్రకటించింది. ఇక నుంచి సెక్షన్ బీలో ఆప్షనల్ ప్రశ్నలు ఉండవని పేర్కొన్నది. కొవిడ్ సమయంలో విద్యార్థులు పరీక్షకు సన్నద్ధం కావడంలో కలిగిన ఆటంకాల నేపథ్యంలో 2021 జేఈఈ(మెయిన్) పరీక్షలో ఎన్టీఏ మార్పు చేసింది. సెక్షన్ బీలో 10 ప్రశ్నలు ఇచ్చి, ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయాలని విద్యార్థులకు ఆప్షన్ ఇచ్చింది.
2024 జేఈఈ(మెయిన్) వరకు ఈ విధానాన్ని కొనసాగించింది. 2025 జేఈఈ(మెయిన్) పరీక్ష నుంచి మాత్రం ఆప్షనల్ ప్రశ్నలు ఉండవని, 2021కు ముందు ఉన్న పద్ధతిలోనే పరీక్ష ఉంటుందని ఎన్టీఏ ప్రకటించింది. సెక్షన్ బీలో ఐదు ప్రశ్నలే ఇవ్వనున్నట్టు, ఈ ఐదు ప్రశ్నలకూ సమాధానాలు రాయాల్సి ఉంటుందని తెలిపింది. కొవిడ్ ముగిసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.