న్యూఢిల్లీ, జూన్ 6 : సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ చుట్టూ రచ్చ జరుగుతున్నది. జవాబు పత్రాలను సరిగ్గా స్కానింగ్ చేయకుండా, మూల్యాంకనంలో తప్పులతో అభాసుపాలైన హైదరాబాద్‌కు చెందిన కోయెంప్ట్ ఎడ్యుటెక్ విషయంలో సీబీఎస్ఈ పెద్దగా చర్యలు తీసుకోవట్లేదు. పైగా అదే సంస్థను రీవాల్యుయేషన్ కోసం కొనసాగిస్తున్నట్టు కొందరు సీబీఎస్ఈ అధికారులు తెలిపారు. కాకపోతే స్టూడెంట్ల డేటాను కోయెంప్ట్ ఎడ్యుటెక్ సర్వర్ల నుంచి సీబీఎస్ఈ సర్వర్లకు ట్రాన్స్ఫర్ చేస్తారని తెలిపారు. పోర్టల్‌ను హ్యాక్ చేయకుండా సెక్యూరిటీ చర్యలు తీసుకుంటున్నట్టు సీబీఎస్ఈ తెలిపింది.
జవాబు పత్రాల వెరిఫికేషన్ దరఖాస్తుల గడువు నేటి వరకు
సీబీఎస్ఈ బోర్డు పరీక్షల ఫలితాల అనంతర సేవల పోర్టల్‌ను యాక్సెస్ చేయడంలో విద్యార్థులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనిని గుర్తించిన సీబీఎస్ఈ 12వ తరగతి జవాబు పత్రాల వెరిఫికేషన్, పునర్ మూల్యాంకనం కోసం దరఖాస్తులను సమర్పించేందుకు చివరి తేదీని జూన్ 7 వరకు పొడిగించింది. ‘గతంలో జూన్ 6 అర్ధరాత్రి వరకు ఉన్న గడువును జూన్ 7 అర్ధ రాత్రి వరకు పొడిగించాం. విద్యార్థులు సవరించిన షెడ్యూల్‌ను గమనించి, దానికి అనుగుణంగా దరఖాస్తులను సమర్పించాల్సిందిగా కోరుతున్నాం’ అని సీబీఎస్ఈ ‘ఎక్స్’ పోస్టులో తెలిపింది.