పాట్నా: దేశంలో సిద్ధాంతాల మధ్య యుద్ధం నడుస్తున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. బీహార్లోని పాట్నాలో జరుగుతున్న ప్రతిపక్ష పార్టీల భేటీకి హాజరైన ఆయన.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో ఐడియాలజీ ఉందని, మరో వైపు ఆర్ఎస్ఎస్, బీజేపీలు భారత్ తోడో ఐడియాలజీతో ఉన్నట్లు రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ బీహార్లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
ప్రజల్లో ద్వేషం, హింసను ప్రేరేపించి దేశాన్ని విభజించాలని బీజేపీ చూస్తున్నట్లు రాహుల్ విమర్శించారు. ప్రేమను, ఐక్యతను తమ పార్టీ చాటుతోందని ఆయన అ న్నారు. పాట్నాలో సమావేశమైన ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తాయని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, రాజస్థాన్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. పేద ప్రజలతో ఉన్న కారణంగా తాము గెలవబోతున్నామని, కానీ బీజేపీ మాత్రం కేవలం ఇద్దరు ముగ్గురి వైపు మొగ్గుచూపుతోందని విమర్శించారు.