(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మైన్పురి జిల్లాలో లలూపూర్ ఒక గ్రామం. జనాభా 2 వేలు. జిల్లా కేంద్రానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. వ్యవసాయం గ్రామీణుల ప్రధాన వృత్తి. అయితే, గడిచిన 20 ఏండ్లలో ఊళ్లోని ప్రతి ఇంట్లో కనీసం ఎవరో ఒకరు క్యాన్సర్తో మరణించే ఉంటారు. స్థానిక చెరువు, భూగర్భ జలాలు కలుషితమవ్వడం, ఆ నీటిని తాగడం వల్లే ప్రజలు క్యాన్సర్బారిన పడుతున్నట్టు పలు పరీక్షల్లో తేలింది. అయినప్పటికీ, ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదు. దీంతో క్యాన్సర్ వస్తుందని తెలిసినా చేతిపంపు నీటినే అక్కడి వాళ్లు తాగుతున్నారు. గ్రామంలో క్యాన్సర్ రక్కసిపై బీబీసీ లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థల్లో పలు కథనాలు రావడం, ప్రజలు పెద్దస్థాయిలో ఆందోళనలు చేపడితే, జిల్లా దవాఖానలో క్యాన్సర్ విభాగాన్ని 2006లో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఖరీదైన సామగ్రిని తీసుకొచ్చింది. అయితే, సేవలను మాత్రం ప్రారంభించలేదు. దీంతో అవన్నీ తుప్పుపట్టి పోయాయి.
తంబాకు అడ్డా
మైన్పురి ప్రాంతంలో పొగాకు పండిస్తారు. ఆ ఊరి పేరిట (మైన్పురి బ్రాండుతో) తంబాకు తయారయ్యేదని స్థానిక పాత్రికేయుడు రాకేశ్ త్యాగి చెప్పారు. ఆ బ్రాండుకు చాలా డిమాండ్ ఉండేది. పొగాకు ఉత్పత్తి పెద్దయెత్తున చేపట్టడంతో లలూపూర్ వంటి గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. క్రమంగా గ్రామంలో క్యాన్సర్ కేసులు, మరణాలు పెరిగిపోయాయి. క్యాన్సర్ మరణాల వార్తలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారడంతో ఇప్పుడు, ఆ బ్రాండు పేరు మార్చి కపూరి తంబాకు అంటూ అమ్ముతున్నారని రాకేశ్ తెలిపారు. క్యాన్సర్ నివారణ, పొగాకు సేవనానికి వ్యతిరేకంగా మైన్పురి ప్రాంతంలో 2004లో పెద్దయెత్తున ఆందోళనలు జరగ్గా, అప్పటి ప్రభుత్వం మైన్పురి జిల్లా దవాఖానలో రూ.15 కోట్లతో 2006లో క్యాన్సర్ విభాగాన్ని నెలకొల్పింది. అనంతరం కోట్ల రూపాయల విలువైన యంత్రాలు ఏర్పాటు చేసినా, అవి తుప్పు పట్టి పోయాయి తప్ప, దవాఖానలో క్యాన్సర్ విభాగపు తలుపులు మాత్రం తెరుచుకోలేదు. లలూపూర్లోనే కాక, నాగలా, జులాహ్, ఖర్పురీ లాంటి చుట్టు పక్కల గ్రామాల్లో కూడా క్యాన్సర్ పీడితులు కనిపిస్తారు. మధ్యప్రదేశ్, గుజరాత్, ముంబై వంటి దూర ప్రాంతాలకు వెళ్లి క్యాన్సర్ రోగగ్రస్థులు వైద్యం చేయించుకుంటూ, అప్పుల భాధలతో కుంగిపోతున్నారు.