Uttar pradesh | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): ఉత్తరప్రదేశ్‌లోని యోగీ ప్రభుత్వం హిందూత్వ శక్తుల ఒత్తిడికి తలొగ్గుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులను ఉద్యోగం నుంచి తొలగించి జైళ్ల పాలు చేస్తున్నది. ప్రముఖ ఉర్దూ రచయిత మహ్మద్ ఇక్బాల్ రచించిన ‘లబ్ పే ఆతి హై దువా..’ అనే ప్రార్థనా గీతాన్ని బరేలీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వజీరుద్దీన్ అనే ఉపాథ్యాయుడు విద్యార్థులతో పాడించాడు. దీనిపై విశ్వహిందూ పరిషత్ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు వజీరుద్దీన్తోపాటు మరో ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. పది రోజుల తరువాత వారికి బెయిల్ దొరికింది. దీనిని సాకుగా తీసుకొని ప్రభుత్వం వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇలా యూపీలో ఉపాధ్యాయులు జైలు ఊచలు లెక్కబెడుతున్న సంఘటనలు మామూలైపోయాయి. హత్రాస్‌లోని బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా ఇటువంటి ఘటననే చోటుచేసుకుంది. విద్యార్థులతో బలవంతంగా నమాజు చేయిస్తున్నారంటూ వదంతులు వ్యాపింపచేశారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందిన పాఠశాల ముందు నిరసనకు దిగారు. ఈ ఘటనలో ప్రభుత్వం మరోమారు హిందూత్వ శక్తుల ఒత్తిడులకు లొంగి పాఠశాల ప్రిన్సిపాల్‌ను, మరో ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేసింది.
సారే జహాఁసే అచ్ఛా..గీతం రచించిన మహమ్మద్ ఇక్బాల్ ఉర్దూలో రచించిన మరో ప్రార్థనా గీతమే ‘లబ్ పే ఆతి హై దువా..’. ఈ ప్రార్థనా గీతాన్ని మన దేశంలోని పలు పాఠశాలలో చాలా ఏండ్లనుంచి విద్యార్థులు ఆలపిస్తున్నారు.
ఓ దేవా.. నా ఈ జీవితం వెలుగునిచ్చే దీపంలా ప్రకాశించాలని నా మనస్సు కోరుకుంటుంది.
లోకాన్ని అలుముకొన్న అంధకారమంతా నీ తేజస్సుతో తొలగిపోవాలి, నలుదిక్కులూ ప్రకాశించాలి..
పూలతో తోటకు అందం ఎలా వస్తుందో, అలాగే నా వ్యక్తిత్వం వల్ల నా మాతృభూమి ప్రకాశించాలి.
దీపం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శలభం( మిణుగురు పురుగు) ఎలా ఆహుతవుతుందో అలాగే విజ్ఞాన జ్యోతిని నేను ఆరాధించాలి..
నేను దీనులను, వృద్ధులను ప్రేమిస్తూ.. పేదల పక్షం ఉండి వారికి అండగా ఉండాలి.
ఓ మా అల్లాహ్ .. నన్ను చెడు నుంచి కాపాడుతూ.. ఎల్లవేళలా సన్మార్గంలో పయనింపజేయమని ప్రార్థిస్తున్నాను.
అయితే గీతాలాపన చేసేటపుడు చాలామంది హిందువులు అల్లాహ్ పదం వద్ద భగవాన్ అని చదువుతారు.
1980లలో యూపీలో చాలామంది పిల్లల్లాగే నేను కూడా ఉర్దూ కవి ఇక్బాల్ రాసిన లబ్ పే ఆతీ హై దువా.. అనే గీతాన్ని పాడాను. హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా అందరూ పాడేవారు. ఇప్పటికీ పాడుతుంటారు. మూడు దశాబ్దాలుగా నేను ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. కానీ ఇప్పుడు యూపీలో పరిస్థితులు మారిపోయాయి. దాంతో నేను కడుపు నింపుకోవడానికి వ్యవసాయ కూలీగా మారాల్సి వచ్చింది.
-వజీరుద్దీన్, సస్పెండైన ఉపాధ్యాయుడు
బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై హిందూత్వ శక్తులు చేసిన ఆరోపణలపై విచారణ జరుగుతుంది. వారు చెబుతున్న కార్యక్రమం వీడియోను చూశాను. అలాంటిదేమీ కనిపించలేదు. స్కూలులో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు.
– అర్చన వర్మ, కలెక్టర్ కం మెజిస్ట్రేట్, హత్రాస్ జిల్లా.