చెన్నై, మే 13: తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ మొదటి రాజకీయ పరీక్షలో గట్టెక్కింది. శాసనసభలో బుధవారం జరిగిన బలపరీక్షలో ఆ పార్టీ 144-22 ఓట్ల తేడాతో విజయం సాధించింది. 234 మంది సభ్యులున్న శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సభ నుంచి వాకౌట్ చేయ గా, ఏఐఏడీఎంకే చీలికవర్గ ఎమ్మెల్యేలు సీ జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు తెలిపారు. అన్నాడీఎంకే రెబల్ వర్గానికి ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం నేతృత్వం వహించారు. ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. సభలోని ఏకైక బీజేపీ ఎమ్మెల్యే ఓటు వేయకుండా తటస్థంగా ఉన్నట్టు ప్రకటించారు.
మరో ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన పీఎంకే (4) కూడా ఓటింగ్‌కు దూరంగా ఉంది. బలపరీక్షలో విజయ్ పార్టీకి కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్, ఏఎంఎంకే, ఐఏడీఎంకే రెబల్ వర్గం మద్దతు తెలిపాయి. సీఎం విజయ్ ఉదయం 9.30 గంటలకు సభలో విశ్వా స తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఈ తీర్మానంపై అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ప్రసంగించారు.
తర్వాత స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఓటింగ్ నిర్వహించి 144-22తో విజయ్ బలపరీక్ష నెగ్గినట్టు ప్రకటించారు. తీర్మానాన్ని 22 మంది వ్యతిరేకించగా, ఐదుగురు తటస్థంగా ఉన్నట్టు తెలిపారు. ఏఎంఎంకే నుంచి విజయం సాధించి, పార్టీ చీఫ్ టీటీవీ దినకరన్‌తో బహిష్కరణకు గురైన ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ కూడా ప్ర భుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు.