న్యూఢిల్లీ, జనవరి 12: వచ్చే రెండేండ్లలో భారత్‌లో పౌరులపై సామూహిక హింస జరుగవచ్చని అమెరికా హోలోకాస్ట్ మెమోరియల్ మ్యూజియం జరిపిన వార్షిక అధ్యయన నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా సామూహిక హింస జరుగుతున్న 168 దేశాల్లో భారత్ 4వ స్థానంలో ఉన్నట్టు పేర్కొంది.
ఈ ఏడాది ముగిసేలోగా భారత్‌లో ఉద్దేశపూర్వకంగా జరిగే సామూహిక హింసకు అవకాశాలు 7.5 శాతం ఉన్నాయని ఆ అధ్యయనం వివరించింది. సాయుధులైన దుండగులు నిరాయుధులైన కనీసం వెయ్యిమందిని హతమారుస్తారని అది అంచనా వేసింది. ఈ హింస జాతి, మతం, రాజకీయాలు లేదా భౌగోళిక పరిస్థితుల కారణంగా జరుగవచ్చని తెలిపింది.
ఇటువంటి హింస జరిగే అవకాశాలున్న దేశాల జాబితాలో భారత్‌కన్నా ముందు మొదటి స్థానంలో మయన్మార్, రెండు మూడు స్థానాల్లో ఆఫ్రికా ఖండంలోని ఛాద్, సూడాన్ దేశాలున్నాయి. ఈ మూడు దేశాల్లో ఇప్పటికే సామూహిక హింస చోటుచేసుకుంటున్నదని ఆ నివేదిక తెలిపింది.
ఈ అధ్యయనంలో హోలోకాస్ట్ మ్యూజియంతోపాటు డార్ట్మౌత్ కాలేజీకి చెందిన పరిశోధకులు పాల్గొన్నారు. ఆయా దేశాలకు చెందిన దశాబ్దాల చారిత్రక డాటాను విశ్లేషించి ఈ అంచనాకు వచ్చినట్టు వారు తెలిపారు. సామూహిక హింస చెలరేగడానికి ముందు సంవత్సరాలలో ఆయా దేశాల్లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో పరిశీలించి, ఈ హెచ్చరికలను చేస్తున్నట్టు పేర్కొన్నారు.