న్యూఢిల్లీ, డిసెంబర్ 23: వివిధ చట్టాలను ఉల్లంఘించినట్లు 1100కి పైగా యూఆర్ఎల్స్(వెజ్ పేజీ చిరునామాలు)పై కేంద్ర హోం శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిని తొలగించాలని ఆదేశిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌కి 91 నోటీసులు జారీ చేసింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(14సీ) ద్వారా ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 79(3)(బీ) కింద నోటీసులు జారీ చేసింది.
హోం శాఖకు చెందిన సహయోగ్ పోర్టల్ కూడా ఇదే నిబంధనను ఉపయోగిస్తూ జారీ చేసిన నోటీసులను ఎక్స్ సవాల్ చేసింది. ఈ 91 నోటీసులలో 58 నోటీసులు 2024లో జారీ అయ్యాయి. వీటిలో 24 నోటీసులు శాంతి భద్రతల భగ్నం, విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి సంబంధించినవి.
నిరుడు జారీ చేసిన మరో మూడు నోటీసుల్లో జాతి సమైక్యత, సమగ్రతలకు ముప్పు తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 91 నోటీసుల్లో కేవలం 14 మాత్రమే బెట్టింగ్ యాప్‌ల ప్రచారం, చిన్న పిల్లలకు సంబంధించిన లైంగిక దాడి మెటీరియల్ పంపిణీ వంటి నేర కార్యకలాపాలకు చెందినవి. యూఆర్ఎల్స్ని తొలగించాలని ఆదేశిస్తూ జారీ చేసిన నోటీసుల్లో సగానికిపైగా(566) ప్రజా జీవితానికి భంగం కల్పిస్తున్నట్లు హోం శాఖ పేర్కొంది. రాజకీయ, ప్రజా ప్రముఖుల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నట్లు 124 యూఆర్ఎల్స్ను హోం శాఖ గుర్తించింది. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 761 యూఆర్ఎల్స్పై హోం శాఖ అభియోగాలు మోపింది.