న్యూఢిల్లీ, ఆగస్టు 2: దేశంలో ఎనిమిది హైస్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. 936 కి.మీ పొడవున రూ.50,665 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుల వల్ల దేశంలోని పలు ప్రాంతాలకు అనుసంధానత ఏర్పడి, రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు.
ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఆరు వరుసలతో ఆగ్రా-గ్వాలియర్ నేషనల్ హై స్పీడ్ కారిడార్, నాలుగు వరుసలతో ఖరగ్పూర్-మోరెగ్రామ్ నేషనల్ హైస్పీడ్ కారిడార్, ఆరు వరుసలతో తరడ్-దీసా-మెహ్సనా-అహ్మదాబాద్ నేషనల్ హైస్పీడ్ కారిడార్, నాలుగు వరుసలతో అయోధ్య రింగ్ రోడ్, నాలుగు వరుసలతో రాయ్పూర్-రాంచీ నేషనల్ హైస్పీడ్ కారిడార్, ఆరు వరుసలతో కాన్పూర్ రింగ్ రోడ్ను నిర్మిస్తారు.