UGC | హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : పరిశ్రమలను విద్యాసంస్థలతో అనుసంధానించడం, పరిశ్రమల్లో నైపుణ్య అంతరాలను తగ్గించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కీలక నిర్ణయం తీసుకున్నది. కొత్తగా అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాం(ఏఈడీపీ) కోర్సులను యూజీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ కోర్సుల్లో చేరిన వారు సెమిస్టర్ మొత్తం పరిశ్రమల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. మూడేండ్ల డిగ్రీ కోర్సులో కనిష్ఠంగా ఒక సెమిస్టర్ మొత్తం అప్రెంటిస్షిప్ రూపంలో పనిచేయాల్సి ఉంటుంది. గరిష్ఠంగా మూడు సెమిస్టర్లు పనిచేసుకోవచ్చు.
నాలుగేండ్ల డిగ్రీ కోర్సులో కనిష్ఠంగా రెండు సెమిస్టర్లు, గరిష్ఠంగా నాలుగు సెమిస్టర్లు అప్రెంటిస్షిప్ రూపంలో పరిశ్రమల్లో పనిచేయవచ్చని యూజీసీ వెల్లడించింది. ఇకపై కంపెనీలు కాంట్రాక్ట్ అప్రెంటిస్షిప్ లేదా ఆన్జాబ్ ట్రైనింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద డిగ్రీ విద్యార్థులను తీసుకోవచ్చు. పరిశ్రమ 30-40శాతం, ఫ్యాకల్టీ 30-40శాతం మూల్యాంకనం చేస్తారు. సెమినార్ ప్రజెంటేషన్, వైవాకు 20-40శాతం వెయిటేజీ ఉంటుంది. మూడు నెలల అప్రెంటిస్షిప్నకు 10 క్రెడిట్లు ఉంటాయి. ైస్టెపెండ్ కూడా ఇస్తారు.