ఇంఫాల్ : మణిపూర్లో రెండు నెలలుగా నెలకొన్న హింసాత్మక వాతావరణం వ్యవసాయంపై ప్రభావం చూపుతున్నది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో పలు ప్రాంతాల్లో చాలామంది రైతులు సాగు చేపట్టలేకపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, రాష్ట్రంలో ఆహార ఉత్పత్తిపై దెబ్బ పడుతుందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎన్ గొజెండ్రో పేర్కొన్నారు. రైతులు 5,127 హెక్టార్ల భూమిని సాగు చేయలేకపోయారని, దీంతో జూన్ 28 నాటికి 15,437 మెట్రిక్ టన్నుల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ వానకాలంలో రైతులు వరి సాగు చేయలేకపోతే.. జూలై చివరి నాటికి నష్టం ఇంకా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంఫాల్ చుట్టుపక్కల రైతుల్లో చాలా మంది సాగుకు దూరంగా ఉన్నారు. రాష్ట్రంలో 2-3 లక్షల మంది రైతులు 1.95 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తారు.
మణిపూర్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. తౌబల్ జిల్లాలో ఓ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్(ఐఆర్బీ) జవాన్ ఇంటికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకొన్నదని పోలీసులు తెలిపారు. మరోవైపు ఘర్షణల నేపథ్యంలో గత రెండు నెలలుగా మూతపడి ఉన్న బడులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా తెరుచుకొన్నాయి.