Defections | హైదరాబాద్, జూన్ 24 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఒక పార్టీ టికెట్‌పై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయింపులకు పాల్పడిన ప్రజాప్రతినిధులపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్లు మూడు నెలల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పేర్కొంది. స్పీకర్ అలా చేయలేని పక్షంలో ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలంటూ కోర్టును ఆశ్రయించే అవకాశం ఫిర్యాదుదారులకు ఉంటుందని గుర్తు చేసింది. ఈ మేరకు మహారాష్ట్రలో శివసేన (ఠాక్రే-షిం డే), ఎన్సీపీ (శరద్ పవార్-అజిత్ పవార్) కేసులకు సంబంధించి ఈ ఏడాది మొద ట్లో జరిగిన విచారణలో, 2020లో మణిపూర్‌కు చెందిన ఓ మంత్రి కేసులో సుప్రీం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది.
రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లోని ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం’ ప్రకారం.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకొనే అధికారం స్పీకర్‌కు మాత్రమే ఉంటుంది. అయితే ఈ నిర్ణయాన్ని స్పీకర్ ఈ పరిమిత సమయంలోపు తీసుకోవాలనే నిబంధన గతంలో లేదు. దీంతో రాజకీయ ప్రయోజనాలను అనుసరించి అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగేది. దీనిపై దృష్టిసారించిన సుప్రీంకోర్టు ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని త్వరగా అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్లకు డెడ్లైన్లు విధిస్తున్నది. మహారాష్ట్రలోని ఎన్సీపీని చీల్చి శివసేన (షిండే)-బీజేపీ ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై ఎన్సీపీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా (ఫిబ్రవరి 15) నిర్ణయం తీసుకోవాలని ఆ రాష్ట్ర స్పీకర్‌ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. శివసేన (షిండే) ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లకు కూడా ఇదే తరహా డెడ్‌లైన్ (జనవరి 10) విధించింది. దీంతో ధర్మాసనం ఆదేశాలు పాటించకపోతే, కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందన్న భావనతో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
ఫిరాయింపులకు పాల్పడే ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు పడటమే కాదు.. వారి రాజకీయ భవిష్యత్తు కూడా ఆగమాగమయ్యే పరిస్థితి ఉంటుందని మణిపూర్ మంత్రికి సంబంధించి సుప్రీం గతంలో ఇచ్చిన తీర్పును బట్టి అర్థమవుతున్నది. మణిపూర్‌కు చెందిన ప్రస్తుత బీజేపీ నేత తౌనోజామ్ శ్యామ్‌కుమార్ సింగ్ 2017లో కాంగ్రెస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీలోకి జంప్ అయ్యారు. దీంతో మంత్రి పదవి దక్కింది. శ్యామ్‌పై అనర్హత వేటు వేయాలని 2017లో కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. మూడేండ్లపాటు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ కాలయాపన చేశారు. దీంతో ఈ కేసును 2020లో విచారించిన సుప్రీం.. శ్యామ్‌కుమార్‌ను మంత్రి పదవి నుంచి తొలగించడమే కాకుండా.. తాము ఉత్తర్వులు ఇచ్చే వరకూ శ్యామ్ శాసనసభలో అడుగుపెట్టకూడదని ఆదేశించింది. అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది.