న్యూఢిల్లీ, డిసెంబర్ 2: సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులను ఎంపికచేసే సుప్రీంకోర్టు కొలీజియం అత్యంత పారదర్శకమైనదని, అందులో ఎలాంటి దాపరికాలు లేవని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. కొలీజియంలో పనిచేసిన మాజీ సభ్యులకు దానిని విమర్శించటం ఫ్యాషనైపోయిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. కొలీజియం సజావుగా పనిచేస్తున్నదని, అలాగే పనిచేయనివ్వాలని పేర్కొంది. పలు హైకోర్టులు, సుప్రీంకోర్టులో ఖాళీల భర్తీకి కొలీజియం చేసిన సిఫారసులను కేంద్రం చాలాకాలంగా పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే కొలీజియం నిర్ణయాలను బహిర్గతం చేయాలంటూ న్యాయవాది అంజలి భరద్వాజ్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ నిర్వహించింది. 2018లో కొలీజియం నిర్వహించిన సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను బహిర్గతం చేయాలని ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయగా కోర్టు తిరస్కరించింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ‘కొలీజియం నిర్ణయాలేమిటో తెలుసుకొనే హక్కు ఈ దేశ ప్రజలకు లేదా? సమాచార హక్కు భారతీయుల ప్రాథమిక హక్కు అని ఇదే కోర్టు తీర్పు చెప్పింది. ఇదే కోర్టు ఇప్పుడు ఆర్టీఐని బలహీనం చేస్తున్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగే అన్ని సంప్రదింపులు, వ్యవహారాలను ప్రజలకు తెలిసేలా అందుబాటులో ఉంచాలి’ అని వాదించారు. ఈ వాదనతో ధర్మాసనం విభేదించింది. ఆర్టీఐని సుప్రీంకోర్టు ఎన్నటికీ బలహీనపర్చదని జస్టిస్ షా స్పష్టం చేశారు. ‘నాటి కొలీజియం సమావేశంలో ఏ రకమైన తీర్మానం ఆమోదించలేదు. కొలీజియం మాజీ సభ్యులు నాడు ఏం చేశారన్నదానిపై ఇప్పుడు మేం ఏ రకంగానూ స్పందించదల్చుకోలేదు. కొలీజియం నిర్ణయాలపై ఆ సంస్థ మాజీ సభ్యులే విమర్శలకు దిగటం ఫ్యాషనైపోయింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తన ఆత్మకథ ‘జస్టిస్ ఫర్ ది జడ్జి’లో 2018 డిసెంబర్ 12న జరిగిన కొలీజియం సమావేశం గురించి పేర్కొన్నారని పిటిషన్‌దారు ఉటంకించారు. ఆ సమావేశంలో రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ ప్రదీప్ నంద్రజోగ్, ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాజేంద్ర మీనన్‌ను సుప్రీం జడ్జిలుగా నియమించాలని కొలీజియం నిర్ణయం తీసుకొన్నది. అయితే, వాళ్ల నియామక వివరాలు బయటకు పొక్కడంతో 2019 జనవరి 10న కొత్త కొలీజియం వారిద్దరి పేర్లను ఆమోదించలేదు.
న్యూఢిల్లీ: ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ను 1994లో గూఢచార నేరంలో ఇరికించడానికి సంబంధించిన కేసులో మాజీ డీజీపీతో సహా నలుగురు వ్యక్తులకు కేరళ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిలును సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం దీనిపై విచారణ జరిపింది. ముందస్తు బెయిలుపై హైకోర్టు పునఃపరిశీలన జరపాలని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా నిర్ణయం జరగాలని స్పష్టం చేసింది. ఐదువారాల వరకు నిందితులను అరెస్టు చేయరాదని ఆదేశించింది. అయితే దర్యాప్తులో సహకారాన్ని బట్టి అరెస్టుపై నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నది.