న్యూఢిల్లీ: ఒక మహిళను తన ఇష్టానికి వ్యతిరేకంగా గర్భం కొనసాగించాలని ఒత్తిడి చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తన 30 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి ఓ బాలికకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఆ బాలిక తన గర్భాన్ని తొలగించుకోవడానికి (మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ-ఎంటీపీ) అనుమతిని నిరాకరిస్తూ ఆమె తన గర్భాన్ని కొనసాగించాలని, ప్రసవం తర్వాత పుట్టే శిశువును దత్తతకు ఇవ్వవచ్చని ఆదేశిస్తూ బాంబే హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పక్కనపెట్టింది. ఒక మహిళ ఇష్టానికి విరుద్ధంగా తన గర్భధారణను పూర్తిచేసుకోవాలని ఏ న్యాయస్థానం ఒత్తిడి చేయలేదని సుప్రీంకోర్టు తెలిపింది. బిడ్డను కనాలో వద్దో నిర్ణయించుకునే హక్కు మహిళలకు ఉంటుందని న్యాయస్థానం తెలిపింది.
పిటిషనర్ అయిన బాలిక తన 17వ ఏట గర్భం దాల్చింది. ఇప్పుడామె వయసు 18 ఏండ్ల నాలుగు నెలలు. ఆమె గర్భధారణ 30 వారాలు దాటింది. ఓ స్నేహితుడితో ఉన్న సంబంధం వల్లే ఆమె గర్భాన్ని దాల్చిందని, గర్భాన్ని కొనసాగించడం ఆ బాలికకు మానసికంగా, శారీరకంగా చాలా బాధాకరమని కోర్టు పేర్కొన్నది. గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతిస్తే బాలిక ప్రాణానికి ముప్పు ఉంటుందని మెడికల్ బోర్డు నివేదికలో ఎక్కడా సూచించలేదని కోర్టు తెలిపింది. అయితే బాంబే హైకోర్టు మాత్రం బిడ్డను కని దత్తతకు ఇవ్వాలని ఆదేశించింది. అక్రమ సంతానం పుట్టడం వల్ల కలిగే సామాజిక కళంకం కారణంగా గర్భాన్ని కొనసాగించమని బలవంతం చేయడం తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తుందని బాలిక తరఫు న్యాయవాది వాదించారు.
ఉభయ పక్షాల వాదనలు విన్న ధర్మాసనం అక్రమ సంబంధంతో ఏర్పడిన గర్భాన్ని కొనసాగించడం అన్నది బాలిక ఇష్టాయిష్టాలపైనే ఉంటుందని స్పష్టం చేశారు. ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ నాగరత్న తీర్పునిస్తూ ‘ఎవరి ప్రయోజనాలు మేము పరిగణనలోకి తీసుకోవాలి? కడుపులో ఉన్న శిశువు ప్రయోజనాలా? లేక ఆ శిశువుకు జన్మనిస్తున్న తల్లి ప్రయోజనాలా?’ అని ప్రశ్నించారు. గర్భాన్ని తొలగించాలా వద్దా అన్న నిర్ణయానికి రావడానికి ధర్మాసనానికి కొంత సమయం పడుతుందని ఆమె వెల్లడించారు.
ఏడేండ్ల లోపు జైలు శిక్ష పడే నేరాలకు నిందితులకు ముందస్తు నోటీసులు ఇవ్వడం తప్పనిసరని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. అరెస్టు చేసే ముందు నిందితులకు బీఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 35(3) కింద పోలీసు అధికారులు తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేసింది. అరెస్టు చేసే అధికారం పోలీసులకు దర్యాప్తునకు సహాయపడేందుకు ఇచ్చిన చట్టబద్ధమైన విచక్షణాధికారమని, దాన్ని తప్పనిసరిగా పరిగణించకూడదని జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది.
ఒక వ్యక్తిని అరెస్టు చేయాల్సిన పరిస్థితులు బీఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 35(1)(బీ) కింద పేర్కొన్న షరతుల ప్రకారం అందుబాటులో ఉన్నప్పటికీ పూర్తిగా అనివార్యమైతే తప్ప అరెస్టు చేయకూడదని ధర్మాసనం తెలిపింది. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసు జారీ చేయడం అన్ని కేసుల్లో అరెస్టుకు ముందు అవసరం ఉందా ముఖ్యంగా నేరానికి ఏడు సంవత్సరాల వరకు శిక్ష విధించగల సందర్భాల్లో నిందితుడిని అరెస్టు చేయడం అవసరమైనపుడు అన్న విషయాన్ని కోర్టు పరిశీలించిన సందర్భంగా ఈ తీర్పు వెలువడింది.