న్యూఢిల్లీ, ఆగస్టు 22: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ రవిశంకర్ నేతృత్వంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్యాత్మిక సంస్థకు సుప్రీంకోర్టు భారీ ఉపశమనం కలిగించింది. 2016లో నిర్వహించిన ఒక వివాదాస్పద ఉత్సవంలో ఢిల్లీలో పర్యావరణ పరంగా సున్నితమైన యమునా వరద ప్రాంతాలకు నష్టం కలిగించారన్న ఆరోపణలపై సంస్థకు విధించిన రూ.5 కోట్ల జరిమానాను వెనక్కి ఇచ్చేయాలంటూ శనివారం ఆదేశాలు జారీ చేసింది.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహించిన కార్యక్రమం కారణంగా యమునా నది సున్నితమైన ఆవరణ వ్యవస్థ దెబ్బతిన్నట్టు ఎలాంటి ప్రత్యక్ష ఆధారం లేదని పేర్కొన్న న్యాయస్థానం.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరఫున జరిమానాను చెల్లించిన వ్యక్తి వికాస్ కేంద్రానికి ఆ మొత్తాన్ని వాపసు చేయాలంటూ ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ)ను ఆదేశించింది. కాగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవం నిర్వహించగా, 2017లో గ్రీన్ ట్రిబ్యునల్ ఈ జరిమానాను విధించింది. దీనిని సంస్థ సుప్రీంలో సవాల్ చేసింది.