న్యూఢిల్లీ: పదవీ విరమణ చేయడానికి ముందు న్యాయమూర్తులు పెద్ద సంఖ్యలో తీర్పులు వెలువరించే పోకడ పెరిగిపోవడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. దీన్ని క్రికెట్ మ్యాచ్ ఆఖరి ఓవర్లో బ్యాట్స్మన్ సిక్సర్లు కొట్టడంతో సుప్రీంకోర్టు పోల్చింది. కొన్ని అభ్యంతరకర తీర్పులు వెలువరించారన్న ఆరోపణతో తన రిటైర్మెంట్కు 10 రోజుల ముందు హైకోర్టుకు చెందిన ఫుల్ బెంచ్ తనను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ మధ్యప్రదేశ్లోని ఓ ప్రిన్సిపల్, జిల్లా జడ్జీ దాఖలు చేసిన పిటిషన్పై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. రిటైర్మెంట్ కావడానికి ముందు పిటిషనర్ సిక్సర్లు కొట్టడం మొదలుపెట్టారు. ఇది చాలా దురదృష్టకర పోకడ. ఇంతకుమించి దీని గురించి వివరించను అని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
రిటైర్మెంట్కు ముందు న్యాయమూర్తులు పెద్ద సంఖ్యలో ఉత్తర్వులు జారీచేసే పోకడ పెరిగిపోతోందని కూడా ఆయన అన్నారు. నవంబర్ 30న పదవీ విరమణ చేయనున్న మధ్యప్రదేశ్ న్యాయాధికారి నవంబర్ 19న సస్పెన్షన్కు గురయ్యారు. ఆయన జారీచేసిన రెండు తీర్పులే ఇందుకు కారణం. న్యాయాధికారి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది విపిన్ సింగ్ పిటిషనర్ సర్వీసులో ఎటువంటి మచ్చ లేదని వాదించారు. సస్పెన్షన్ చట్టబద్ధతను ఆయన ప్రశ్నిస్తూ న్యాయపరమైన ఉత్తర్వులు జారీ చేసినందుకు వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేరని ఆయన వాదించారు. ఒకవేళ న్యాయాధికారి ఇచ్చిన తీర్పులపై అభ్యంతరాలుంటే ఉన్నత న్యాయస్థానంలో దాన్ని సవాలు చేసుకుని న్యాయం పొందవచ్చని ఆయన తెలిపారు.
ఈ వాదనతో సూత్రప్రాయంగా ఏకీభవించిన సుప్రీంకోర్టు కేవలం పొరపాటు తీర్పులు ఇచ్చినందుకు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని తెలిపింది. ఆయన ఇచ్చిన తీర్పుల్లో నిజాయితీ కొరవడిందని ధర్మాసనం పేర్కొంది. న్యాయపరమైన పొరపాట్లకు దుష్ప్రవర్తనకు చాలా తేడా ఉందని స్పష్టం చేసింది. న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచాలని నవంబర్ 20న మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసినట్లు సీజేఐ గుర్తు చేశారు. దీని ఫలితంగా పిటిషనర్ 2026 నవంబర్ 30న రిటైర్ అవుతారని ఆయన చెప్పారు. తన సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్కూ సీజేఐ సూచించారు.