Ganges River | న్యూఢిల్లీ, జూన్ 21: ప్రపంచంలోనే రెండో అతి పెద్ద నదిగా గుర్తింపు పొందిన గంగానదికి సంబంధించి ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. గంగానదిపై వేర్వేరు దేశాల్లోని విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనం వివరాలు ‘నేచర్ కమ్యూనికేషన్స్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. 2500 ఏండ్ల క్రితం సంభవించిన ఒక భూకంపం వల్ల గంగానది ప్రవాహ దిశను మార్చుకున్నదని ఈ అధ్యయనంలో తేలింది.
సాధారణంగా నదులు క్రమంగా దిశ మార్చుకునేందుకు వందల ఏండ్లు పడుతుంది. గంగానది లాంటి పెద్ద నది దిశ మార్చుకోవడం దాదాపు జరగదని పరిశోధకులు చెప్తున్నారు. అయితే, ఒక భారీ భూకంపం కారణంగా గంగానది ఒకేసారి దిశ మార్చుకుందని వెల్లడించారు. ఉపగ్రహ చిత్రాలను అధ్యయనం చేసిన పరిశోధకులు దాదాపు 100 కిలోమీటర్ల మేర గంగా నది పాత ప్రధాన ప్రవాహ ప్రాంతాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేలుపై 7 – 8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల ఈ మార్పు చోటు చేసుకొని ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.