బలియా, జనవరి 22: ఉత్తరప్రదేశ్లో బలియా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి ఘటన చోటుచేసుకొన్నది. కొవిడ్-19 లాక్డౌన్ సమయానికి సంబంధించిన మధ్యాహ్న భోజన అలవెన్స్లను చెల్లించకపోవడంపై విద్యార్థులు తీవ్ర చర్య చేపట్టారు.
పాఠశాల హెడ్మాస్టర్తో సహా ఉపాధ్యాయులందరినీ ఓ గదిలో దాదాపు గంటపాటు బంధించి తమ నిరసన తెలిపారు. బైరియా ఏరియాలోని దుర్జాన్పూర్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. కొవిడ్ లాక్డౌన్ సమయంలో మధ్యాహ్న భోజన పథకం నడవని నేపథ్యంలో.. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆహార ధాన్యాలు, మిడ్మే మీల్ అలవెన్స్ ఇవ్వాలని యూపీ ప్రాథమిక విద్యా శాఖ గతంలో నిర్ణయం తీసుకొన్నది. అలవెన్స్ డబ్బును విద్యార్థుల తల్లిదండ్రులకు ఇవ్వాల్సి ఉన్నది.
అయితే తమకెవ్వరికీ అలవెన్స్ అందలేదని, ఫిర్యాదు చేసినా పట్టిచుకోవడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. దీని కారణంగానే విద్యార్థులు ఈ నిరసన చర్య చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు. విద్యార్థులకు నాలుగో ఫేజ్ మిడ్డే మీల్ అలవెన్స్లు చెల్లించలేదని పాఠశాల హెడ్మాస్టర్ జైప్రకాశ్ యాదవ్ అంగీకరించారు. కాగా, టీచర్ల లాకప్ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు బైరియా బ్లాక్ విద్యాశాఖాధికారి పేర్కొన్నారు. ఆరోపణలు నిజమైతే, పెండింగ్ అలవెన్స్లను తక్షణం చెల్లిస్తామని అన్నారు.