Lok Sabha Elections | వారణాసి/చండీగఢ్, మే 31: లోక్‌సభ చివరి దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఏడు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 57 నియోజకవర్గాలకు శనివారం పోలింగ్ జరగనుంది. 904 మంది అభ్యర్థులు ఈ విడతలో పోటీ పడుతున్నారు. మొత్తం 10.06 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 5.24 కోట్ల మంది పురుషులు, 4.82 కోట్ల మంది మహిళలు, 3,574 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న నాలుగు స్థానాలకు, యూపీలో 13, పశ్చిమ బెంగాల్లో తొమ్మిది, బీహార్‌లో ఎనిమిది, ఒడిశాలో ఆరు, జార్ఖండ్‌లో మూడు స్థానాలతో పాటు చండీగఢ్ స్థానానికి పోలింగ్ జరగనుంది. వీటితో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 42 స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్‌లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, శనివారం సాయంత్రం 6.30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి కానున్నాయి.
అందరి ఆసక్తి ఈ స్థానాలపైనే
ఏడో విడతలో పోలింగ్ జరగనున్న వాటిలో పలు కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనది ప్రధాని పోటీ చేస్తున్న వారణాసి. ఇక్కడ కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్, బీఎస్పీ నుంచి అతెర్ జమల్ లరి పోటీ చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన కొలిశెట్టి శివకుమార్ కూడా యుగతులసి పార్టీ తరపున బరిలో ఉన్నారు. యూపీలోనే కేంద్రమంత్రులు మహేంద్రనాథ్ పాండే(చందౌలి), పంకజ్ చౌదరి(మహరాజ్‌గంజ్), అనుప్రియా పటేల్(మిర్జాపూర్) సైతం ఈ దఫాలో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ నుంచి తృణమూల్ తరపున మమతా బెనర్జీ మేనల్లుడు, హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్పూర్ నుంచి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, మండి నుంచి నటి కంగనా రనౌత్ బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.
ఎగ్జిట్‌పోల్స్‌పై ఉత్కంఠ
శనివారం సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఎన్నికల ఫలితాల వెల్లడికి మరో మూడు రోజులు గడువు ఉన్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలపై వివిధ టీవీ చానళ్లు నిర్వహించే చర్చల్లో పాల్గొనరాదని కాంగ్రెస్ నిర్ణయించింది. ఊహాగానాలు, టీఆర్పీల కోసం బురద జల్లుడు వ్యవహారాల్లో పాల్గొనబోమని పేర్కొన్నది.