న్యూఢిల్లీ: 1969 నాటి జనన మరణాల నమోదు చట్టానికి సవరణలు చేస్తూ కేంద్రం పార్లమెంటు ముందుకు తీసుకొచ్చిన సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. పాత చట్టానికి పలు సవరణలు చేస్తూ కొత్తగా రూపొందించిన జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు-2023ను కేంద్రం జూలై 26న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు మంగళవారం (ఆగస్టు 1న) సభలో చర్చకు వచ్చింది. చర్చ అనంతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది.
సవరించిన బిల్లు ప్రకారం.. ఏదైనా కుటుంబంలో కొత్తగా జననాలు, మరణాల నమోదుకు ఆధార్ తప్పనిసరి కానుంది. 1969 నాటి జనన, మరణాల నమోదు చట్టం ప్రకారం ఆధార్ తప్పనిసరి కాదు. అంతేగాక కొత్త చట్టం అమల్లోకి వస్తే రిజిస్టర్డ్ జననాలు, మరణాల డేటాను రాష్ట్రాలు తప్పనిసరిగా ఎప్పటికప్పుడు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI) తో పంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రాలు ప్రతి ఏడాది వార్షిక గణాంక నివేదికలను మాత్రమే RGIకి పంపుతున్నాయి.
1969 నాటి జనన, మరణాల నమోదు చట్టం ప్రకారం జనన ధృవీకరణ పత్రం అనేది కేవలం వయసును తెలియజేసే సర్టిఫికెట్ మాత్రమే. కానీ ఇప్పుడు పాఠశాలల్లో ప్రవేశాలకు, ఓటరుగా నమోదు చేసుకోవడానికి, వివాహాలకు, పాస్‌పోర్టుల జారీకి, ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తులకు జనన ధృవీకరణ పత్రాలను తప్పనిసరి చేయాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.