న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో భోజనం నాణ్యత మరోమారు చర్చనీయాంశమైంది. ఈ నెల 18న భోపాల్ నుంచి ఆగ్రా వెళ్తున్న జంటకు రైలులో సరఫరా చేసిన భోజనంలో బొద్దింక దర్శనమిచ్చింది. ఈ ఘటనపై వారి మేనల్లుడు సోషల్ మీడియా ప్లాట్ఫాం ‘ఎక్స్’ ద్వారా రైల్వేకు ఫిర్యాదు చేశాడు. భోజనం సరఫరా చేసిన వెండర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ ఫిర్యాదుపై రైల్వే గురువారం స్పందించింది. రైలులో ఆ జంటకు ఎదురైన అనుభవానికి క్షమాపణలు తెలిపింది. భోజనం సరఫరా చేసిన వెండర్పై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు జరిమానా కూడా విధించినట్టు బదులిచ్చింది.