న్యూఢిల్లీ: దాదాపు రూ.3.25 లక్షల కోట్లతో 114 రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతున్నది. ఈ వారంలో జరగనున్న రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి సమావేశంలో ఈ భారీ ఒప్పందం గురించి చర్చలు జరపనున్నది. ఈ విమానాలను 30 శాతానికిపైగా స్వదేశీ విడిభాగాలతో భారత్లో ఉత్పత్తి చేయనున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా 12 నుంచి 18 రాఫెల్ యుద్ధ విమానాలను వెంటనే భారత అమ్ములపొదిలో ప్రవేశపెట్టే స్థితిలో పొందనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ విమానాల్లో భారతదేశంలో తయారైన ఆయుధాలు, ఇతర స్వదేశీ వ్యవస్థలను పొందుపరిచేందుకు ఫ్రాన్స్ అనుమతిని భారత్ ఒప్పందంలో భాగంగా కోరుతున్నదని వారు చెప్పారు.