న్యూఢిల్లీ: బీహార్లో చేపడుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరిగింది. ఎన్నికల సంఘాన్ని అత్యున్నత న్యాయస్థానం కఠినంగా ప్రశ్నించింది. ఈ టైంలో ఓటర్లకు చెందిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని అడిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ అవసరం ఏంటని కోర్టు ప్రశ్నించింది.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చట్టబద్దంగా జరుగుతున్న విషయాన్ని అంగీకరిస్తున్నామని, కానీ ఎన్నికలకు ముందే ఎందుకు ఈ ప్రక్రియను చేపడుతున్నారని ఎన్నికల సంఘాన్ని జస్టిస్ సుధాన్షు దులియా ప్రశ్నించారు. మీరు చేపట్టే ప్రక్రియతో సమస్య లేదని, కేవలం ఈ సమయంలో ఎందుకు చేస్తున్నారన్నదే సమస్య అని కోర్టు పేర్కొన్నది. ఓటర్ల జాబితా నుంచి పేర్లు కోల్పోయిన వారికి.. తమ పేర్లను జోడించేందుకు సమయం ఉండదని కోర్టు తెలిపింది.
ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ పేరుతో పేద ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళన కూడా చేపట్టాయి. ఓటర్ల జాబితా సవరణ సమయంలో.. ప్రజల వద్ద ఉన్న ఆధార్, రేషన్ కార్డు,ఓటరు కార్డులను పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఓటర్లను రీవెరిఫై చేసే సమయంలో ఈ మూడు కార్డులను గుర్తింపుగా తీసుకోవాలని కోర్టు సూచించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై స్టే విధించడం లేదని కోర్టు చెప్పింది.
జూలై 28వ తేదీన మళ్లీ ఈ కేసులో విచారణ జరగనున్నది.