Manmohan Singh | మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ (Manmohan Singh) భారత ఆర్థిక విధానాలపై చెరగని ముద్ర వేశారు. ఆర్థిక సంక్షోభం నుంచి భారత్‌ను గట్టెక్కించడమే కాకుండా, ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా దేశాన్ని నిలిపారు. ప్రధానిగా పదేళ్లు సేవలందించిన ఆయన దేశ చరిత్రలో ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానిగా పని చేసినప్పుడు ఆయనను మౌనమునిగా ప్రతిపక్షాలు విమర్శించేవి. మౌనంగా ఉంటూనే పదేళ్లపాటు దేశాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించిన ఘనత ఆయనకే దక్కుతుంది. దేశాభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. దేశానికి సరికొత్త దశ, దిశ చూపిన ప్రధానిగా చరిత్రలో నిలిచిపోయారు.
2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ మొదటి పర్యాయంలోనే దేశంలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చారు. పైకి మృదుస్వభావిలా కనిపించినా దేశం కోసం తీసుకునే నిర్ణయాల్లో అత్యంత కఠినంగా వ్యవహరించారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు, ఉపాధి హామీ పథకం ప్రారంభం వంటి ఎన్నో కీలక పరిణామాలు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే చోటుచేసుకున్నాయి. 2008లో చారిత్రాత్మకమైన భారతదేశం-అమెరికా పౌర అణు ఒప్పందంపై సంతకం చేశారు. భారతదేశం ప్రపంచ అణు మార్కెట్లోకి ప్రవేశించడానికి, ఇంధన సంక్షోభాన్ని అధిగమించడానికి ఈ ఒప్పందం దోహదపడింది. యూపీఏ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిచ్చిన లెఫ్ట్ పార్టీలు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. మద్దతు ఉపసంహరించుకున్నాయి. అయినా మన్మోహన్ సింగ్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అవసరమైతే ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమయ్యారు.
ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని తెలుసుకునే హక్కు సామాన్యులకు ఉండాలనే లక్ష్యంతో సమాచార హక్కు చట్టాన్ని తెచ్చారు. గ్రామీణ ప్రజలకు వ్యవసాయేతర ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చారిత్రక ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రతి పౌరుడికి ఒక విశిష్ఠ గుర్తింపు సంఖ్య ఉండాలని ఆధార్ వ్యవస్థను తీసుకొచ్చారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యం కోసం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ చేపట్టారు. మన్మోహన్ సింగ్ పాలనాకాలంలోనే దేశంలో 3జీ, 4జీ సేవల ప్రారంభంతో మొబైల్ సాంకేతిక విప్లవం ఊపందుకుంది. ప్రైవేటు పాఠశాలల్లోనూ కొందరు పేద విద్యార్థులకు ఉచితంగా చదువుకునేలా నిబంధనలు రూపొందించింది. సామాన్యుడి చేతికి పాశుపత్రాస్త్రంలాంటి సమాచార హక్కును అందించింది. దేశంలో 3 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు రూ.72 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్ ప్రభుత్వానికే దక్కుతుంది. మన్మోహన్ ప్రభుత్వంలో దేశంలో జరిగిన మార్పులను గుర్తించిన ప్రజలు 2009లో మరోసారి యూపీఏ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. 2009 మే 22న మన్మోహన్ సింగ్ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
Also Read..
Manmohan Singh: మారుతీ 800 కారంటే మన్మోహన్‌కు ఇష్టం !
Manmohan Singh | ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న మన్మోహన్ సింగ్‌ను.. రాజకీయాల్లోకి తీసుకొచ్చిన పీవీ
Manmohan Singh | మౌనలోకాలకు మన్మోహన్.. భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, మాజీ ప్రధాని ఇకలేరు