హైదరాబాద్: భారత ఆర్థిక విధానాలపై మన్మోహన్ సింగ్ (Manmohan Singh) చెరగని ముద్ర వేశారు. ఆర్బీఐ గవర్నర్‌గా, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలతో ఆధునిక ప్రపంచంలో భారత్‌ను ఒక బలమైన ఆర్థిక శక్తిగా నిలబడేలా చేశారు. సమయం వచ్చినప్పుడు ఏ శక్తీ ఆపలేదు. ప్రపచంలో భారత్ కీలక ఆర్థిక శక్తిగా అవతరించడం అన్నది అలాంటి ఆలోచనే అని నేనీ సభకు చెప్పాలనుకుంటున్నా అంటూ 1991లో కేంద్ర ఆర్థిక మంత్రిగా తొలి బడ్జెట్ ప్రసంగంలో ఆయన చేసిన వ్యాఖ్యలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఆర్థిక వ్యవస్థను సరళీకరించి భారతదేశం ప్రపంచంలోనే ఆర్థిక సూపర్ పవర్‌గా మారడానికి మార్గం సుగమం చేసిన మన్మోహన్ సింగ్ మన పీవీ నరసింహా రావు చెక్కిన శిల్పమే.
విద్యావేత్తగా, ఆర్థికవేత్తగా మన్మోహన్ తనదైన ముద్ర వేశారు. ఆర్థిక రంగంలో ఆయన అనుభవం, జ్ఞానంతో ఎన్నో గొప్ప అవకాశాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. 1991లో దేశం కఠినమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానిగా ఎన్నికైన పీవీ నరసింహారావు (PV Narasimha Rao).. ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న మన్మోహన్ సింగ్‌కు అనూహ్యంగా తన క్యాబినెట్లో చోటు కల్పించి ఆర్థిక మంత్రిని చేశారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసే కీలక బాధ్యతను అప్పగించారు. ఈ సమయంలోనే దేశంలో ఆర్థిక సంస్కరణలకు, సరళతర విధానాలకు మన్మోహన్ సింగ్ శ్రీకారం చుట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపించారు. ఆర్థిక సంక్షోభం నుంచి భారత్‌ను గట్టెక్కించడమే కాకుండా, ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా దేశాన్ని నిలిపారు.
1992లో పీవీ, మన్మోహన్సింగ్ కలిసి ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే ప్రపంచంలో మన దేశం తలెత్తుకుని నిలబడేలా చేశాయని ఆర్థిక రంగ నిపుణలు చెబుతుంటారు. 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ దేశంలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చారు. పైకి మృదుస్వభావిలా కనిపించినా దేశం కోసం తీసుకునే నిర్ణయాల్లో అత్యంత కఠినంగా వ్యవహరించారు మన్మోహన్ సింగ్. 2008లో చారిత్రాత్మకమైన భారతదేశం-అమెరికా పౌర అణు ఒప్పందంపై సంతకం చేశారు మన్మోహన్ సింగ్. భారతదేశం ప్రపంచ అణు మార్కెట్లోకి ప్రవేశించడానికి, ఇంధన సంక్షోభాన్ని అధిగమించడానికి ఈ ఒప్పందం దోహదపడింది. యూపీఏ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిచ్చిన లెఫ్ట్ పార్టీలు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. మద్దతు ఉపసంహరించుకున్నాయి. అయినా మన్మోహన్ సింగ్ వెనక్కి తగ్గలేదు. అవసరమైతే ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమయ్యారు.
దేశంలో పేదవాళ్ల ఆకలి తీర్చేందుకు 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్. పాలనలో పారదర్శకతను తీసుకొచ్చేలా.. అధికారులు గుట్టుగా ఉంచే సమాచారాన్ని సామాన్యులు సైతం పొందేందుకు సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. అలా మన పీవీకి గురువుకు తగ్గ శిష్యుడిగా మన్మోహన్సింగ్ పేరు తెచ్చుకున్నారు.