న్యూఢిల్లీ, నవంబర్ 13: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)ల స్వతంత్రతను దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఐఐఎంలపై రాష్ట్రపతికి విశేషాధికారాలు కల్పించింది. నూతన నిబంధనల ప్రకారం.. దేశంలోని అన్ని ఐఐఎంలకు రాష్ట్రపతి ‘విజిటర్’గా ఉంటారు.
బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్పర్సన్, డైరెక్టర్ల నియామకం లేదా తొలగింపుపై రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. అదేవిధంగా చట్ట ప్రకారం ‘విజిటర్’ ఆదేశాలను పాటించడం లేదని భావిస్తే.. సమర్థంగా విధులు నిర్వహించడం లేదని అనిపిస్తే బోర్డును రద్దు చేసేందుకు కూడా రాష్ట్రపతికి అధికారాలు కల్పించారు.
కొత్త డైరెక్టర్ల నియామకానికి సంబంధించి సెర్చ్ ప్యానెళ్ల నియామకం, పాలసీ నిర్ణయాలు, వార్షిక బడ్జెట్ల ఆమోదం, ఫీజుల నిర్ణయం వంటి అంశాలపై కూడా రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. అంతకుముందు ఈ బోర్డు రద్దు క్లాజ్ ఉండేది కాదు. డైరెక్టర్ల నియామకంలో బోర్డుకే పూర్తి బాధ్యత, అధికారం ఉండేది. ఐఐఎం రూల్స్-2018ని సవరిస్తూ తీసుకొచ్చిన ది ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్(సవరణ) రూల్స్-2023 బిల్లుకు జూలైలో పార్లమెంట్ ఆమోదం తెలిపింది.