Tejashwi Yadav : దేశంలో జనం మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్లకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ (RJD) అగ్ర నాయకుడు, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) అన్నారు. విద్వేష రాజకీయాలు ఎంతో కాలం మనలేవని, జనం మధ్య విద్వేషాలను ప్రేరేపించే వారికి జనం ఫుల్ స్టాప్ పెడుతారని ఆయన వ్యాఖ్యానించారు.
బీహార్లో నాలుగు స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు తేజస్వి యాదవ్ ఈ విధంగా స్పందించారు. బీహార్లో ఉప ఎన్నికలు జరుగుతున్న నాలుగు స్థానాలను తామే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
కాగా, జార్ఖండ్ అసెంబ్లీకి ఈ నెల 13, 20 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటే బీహార్ సహా పలు రాష్ట్రాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా ఈ నెల 20న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరనుంది. ఈ నెల 23న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.