న్యూఢిల్లీ, మే 2: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ముందు జాగ్రత్తగా సరిపడా ఆహార నిల్వలు ఉంచుకోవాలని పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రభుత్వం శుక్రవారం తన పౌరులకు సూచించింది. పీవోకే ప్రధాని చౌదరి అన్వరల్ ఉల్ హక్ స్థానిక అసెంబ్లీలో మాట్లాడుతూ నియంత్రణ రేఖ వెంబడి ప్రాంతాలతో పాటు 13 నియోజకవర్గాల ప్రజలు రెండు నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ ఉంచుకోవాలని కోరారు.
ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాలను పౌరులకు అందించేందుకు పీవోకే రూ.100 కోట్లతో ఒక అత్యవసర నిధిని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కాగా, భద్రతా కారణాలతో ఇప్పటికే పీవోకేలోని గిల్గిట్, స్కర్దుతో పాటు పలుప్రాంతాలకు పాకిస్థాన్ బుధవారం నుంచి విమాన సర్వీసులను నిలిపివేసింది.