న్యూఢిల్లీ: సరైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేనప్పటికీ చాలామంది తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల వైపు ఆకర్షితులవుతున్నారని నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) డైరెక్టర్ డీపీ సక్లానీ పేర్కొన్నారు. ప్రభుత్వ బడుల్లోనూ నాణ్యమైన విద్య అందుతున్న ప్రస్తుత తరుణంలో ఇంగ్లిష్ మీడియం స్కూళ్లపై మక్కువ పెంచుకోవడం అంటే ఆత్మహత్యకు తక్కువేమీ కాదని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఆంగ్లమాధ్యమ పాఠశాలలపై మక్కువ పెంచుకుంటున్నారని, తగినంత మంది ఉపాధ్యాయులు లేకున్నా, సరైన శిక్షణ లేకున్నా తమ పిల్లలను అలాంటి పాఠశాలలకు పంపేందుకు వారు ఇష్టపడుతున్నారని విమర్శించారు. ఆత్మహత్యకు ఇది ఎంతమాత్రమూ తక్కువ కాదని నొక్కి చెప్పారు. అందుకనే కొత్త (జాతీయ) విద్యావిధానం మాతృభాషలోనే పిల్లలకు విద్యాబోధన చేయాలని చెప్తున్నదని వివరించారు. మన మాతృభాషను, మూలాలను అర్థం చేసుకోలేనప్పుడు మిగతాది ఎలా అర్థమవుతుందని ఆయన ప్రశ్నించారు.