Indian Students | న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల వల్ల స్టూడెంట్ వీసాలపై అమెరికాకు వెళ్లేవారి సంఖ్య జూలైలో దారుణంగా తగ్గిపోయింది. జూలైలో కేవలం సుమారు 79,000 మంది మాత్రమే అమెరికాకు వెళ్లారు. 2025లో నెలవారీ గణాంకాలను పరిశీలించినపుడు జూలైలోనే అత్యధికంగా 28 శాతం తగ్గుదల కనిపించింది. భారత్ నుంచి వెళ్లే విద్యార్థులు 46 శాతం మేరకు తగ్గిపోగా, చైనా నుంచి వెళ్లేవారు 26 శాతం వరకు తగ్గిపోయారు. నిరుటితో పోల్చుకున్నపుడు వరుసగా నాలుగో నెలలో ఈ తగ్గుదల నమోదైంది. యూఎస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్ డాటాను విశ్లేషించిన బ్లూమ్‌బెర్గ్ ఈ వివరాలను వెల్లడించింది. 2023-24 విద్యా సంవత్సరంలో 3,32,000 మంది భారతీయ విద్యార్థులు అమెరికన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎన్రోల్ అయ్యారు.
ఆ ఏడాదిలో విదేశీ విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులే. ఆ తర్వాతి స్థానంలో 2,77,000 మందితో చైనా విద్యార్థులు ఉన్నారు. ఆ సంవత్సరంలో రికార్డు స్థాయిలో 11 లక్షల మంది విదేశీ విద్యార్థులు అమెరికాకు వెళ్లారు. మొదటిసారి అమెరికాకు వెళ్లే విదేశీ విద్యార్థులు 30 శాతం మేరకు తగ్గుతారని ఆ దేశంలోని విద్యా సంస్థలు అంచనా వేశాయి. ఫలితంగా 2.6 బిలియన్ డాలర్ల మేరకు ట్యూషన్ రెవిన్యూ నష్టం వస్తుందని అంచనా వేశాయి. మరో అంచనా ప్రకారం, ఈ ఏడాదిలో 1,50,000 మంది విద్యార్థులు తగ్గుతారని, ఫలితంగా ఆగస్టు చివరి-సెప్టెంబరు ప్రారంభంలో సెమిస్టర్లో హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్టర్‌కు 7 బిలియన్ డాలర్ల నష్టం వస్తుందని, అమెరికాలోని వివిధ నగరాల్లో 60,000కుపైగా ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని తెలుస్తున్నది.
ట్రంప్ సర్కారు తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ వల్ల అనేక మార్పులు జరుగుతున్నాయి. విశ్వవిద్యాలయాలకు నిధుల కోత, ఉద్యోగులపై వేటు వంటి వాటితోపాటు భారతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. తాజాగా అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ 6,000కుపైగా స్టూడెంట్ వీసాలను రద్దు చేసింది. వీసా స్క్రూటినీ కఠినతరం అయింది. వీటిలో సుమారు 4,000 వీసాల రద్దుకు కారణం క్రిమినల్ ఉల్లంఘనలని, ఉగ్రవాదానికి మద్దతిచ్చినందుకు 200-300 వరకు రద్దయ్యాయని తెలిపింది. మరోవైపు యూఎస్ ఇమిగ్రేషన్ అధికారులు వీసా దరఖాస్తుదారుల సామాజిక మాధ్యమాల ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా కానీ, యాంటీసెమెటిక్ కంటెంట్ కానీ ఉన్నాయేమో చూస్తున్నారు. దీంతో దరఖాస్తుదారులు పెట్టే ప్రతి పోస్టు ముప్పు తెచ్చిపెట్టేదిగా భావించవలసి వస్తున్నది.
స్టేట్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు కాన్సులేట్లు ఎఫ్-1 వీసాల కోసం కొత్త అపాయింట్మెంట్ల షెడ్యూలింగ్‌ను తాత్కాలికంగా నిలిపేశాయి. దీంతో చాలా మంది ఆశావహులు చిక్కుకుపోయారు లేదా తమ ప్రణాళికలను వాయిదా వేసుకున్నారు. ఒకవేళ ఇంటర్వ్యూలు మంజూరైనా, దరఖాస్తుదారులు మునుపెన్నడూ లేనంత స్థాయిలో తనిఖీలకు గురవుతున్నారు.