Delhi CM : ఇవాళ పత్రికల్లో వచ్చిన పబ్లిక్ నోటీసులు తప్పుడువని, అదంతా బీజేపీ కుట్ర అని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి అన్నారు. ఆప్ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం కోసం బీజేపీ నేతలు కొంతమంది అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆ పబ్లిక్ నోటీస్లు వచ్చేలా చేశారని ఆమె ఆరోపించారు. మహిళా సమ్మాన్ యోజన, వృద్ధులకు ఉచిత వైద్యం అందించే సంజీవని యోజన పథకాలను నోటిఫై చేయలేదని ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేసింది.
ఆ నోటీస్ ఢిల్లీలోని అన్ని ప్రధాన పత్రికల్లో అచ్చయ్యింది. దాంతో ఎన్నికల్లో ఓట్ల కోసం హామీలు ఇచ్చిన కేజ్రీవాల్.. ఇప్పుడు వాటిని తుంగలో తొక్కుతున్నారని, మహిళా సమ్మాన్ యోజన పథకాన్ని నోటిఫై చేయలేదని ఆప్ సర్కారు పబ్లిక్ నోటీస్ ఇవ్వడం ద్వారా ప్రజలకు ఇచ్చిన మాట తప్పిందని బీజేపీ నేతలు విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఢిల్లీ సీఎం అతిషి స్పందించారు.
‘ఇవాళ వార్తా పత్రికల్లో అచ్చయిన పబ్లిక్ నోటీస్లు తప్పుడువి. బీజేపీ నేతల ఒత్తిడి మేరకు ప్రభుత్వంలోని కొందరు అధికారులు ఆ నోటీస్లు ఇచ్చారు. ఇదంతా బీజేపీ కుట్ర. ఈ తప్పుడు నోటీస్ ఇచ్చిన అధికారులపై పాలనా యంత్రాంగం, పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారు. మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన పథకాలు ఇప్పటికే ప్రజా బాహుళ్యంలోకి వెళ్లాయి. వాటిని కచ్చితంగా అమల్లోకి తీసుకొస్తాం’ అని సీఎం అతిషి హామీ ఇచ్చారు.