Caste Census | పాట్నా, అక్టోబర్ 2: బీహార్‌లోని నితీశ్‌కుమార్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణన డాటాను సోమవారం విడుదల చేసింది. రాష్ట్ర జనాభాలో దాదాపు 63 శాతం మంది ఓబీసీలు, ఈబీసీలు ఉన్నట్టు సర్వేలో తేలింది. రాష్ట్ర మొత్తం జనాభా 13.07 కోట్లు ఉండగా.. అందులో అత్యంత వెనుకబడిన తరగతుల(ఈబీసీ) వారు 36 శాతం, ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీ) వారు 27.13 శాతం ఉన్నారని నివేదిక వెల్లడించింది. 14.27 శాతంతో ఓబీసీ గ్రూపులోని యాదవులు రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన సామాజికవర్గంగా ఉన్నది.
కులగణన డాటా ప్రకారం ఎస్సీలు రాష్ట్ర జనాభాలో 19.65 శాతం, ఎస్టీలు 1.68 శాతం(22 లక్షల మంది) మంది ఉన్నారు. అన్రిజర్వ్డ్ క్యాటగిరీకి చెందిన అగ్రకులాల వాళ్లు జనాభాలో 15.2 శాతంగా ఉన్నారని డాటా వెల్లడించింది. కులగణన సర్వే మతాల పరంగా జనాభా వివరాలను కూడా వెల్లడించింది. రాష్ట్రంలో 81.99 శాతంతో జనాభాతో మెజార్టీ మతంగా హిందువులు ఉన్నారు. తర్వాతి స్థానంలో 17.70 శాతంతో ముస్లింలు ఉన్నారు. ఇక క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, ఇతర మతాలను విశ్వసించే వారు, ఏ మతాన్ని విశ్వసించని వారి సంఖ్య మొత్తం కలిపి కూడా ఒక శాతం కంటే తక్కువే. కులగణన వంటి భారీ ప్రక్రియను విజయవంతంగా చేపట్టిన అధికారులను సీఎం నితీశ్‌కుమార్ ప్రశంసించారు. త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి, కులాల డాటాను వివరిస్తామని పేర్కొన్నారు.