న్యూఢిల్లీ: కేంద్రంలో అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి (INDIA alliance) తదుపరి, మూడో సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరగనుంది. ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన డీఎంకే (DMK) అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) ఈ విషయాన్ని వెల్లడించారు. రెండు రోజులపాటు మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సమావేశం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఆ సమావేశంలో కూటమి పార్టీలన్నీ కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించబోతున్నాయని స్టాలిన్ చెప్పారు. ఆ సమావేశంలో డీఎంకే తరఫున తాను కూడా పాల్గొనబోతున్నానని తెలిపారు. కాగా, ఇండియా కూటమి తొలిసారిగా ఈ ఏడాది జూన్ 23న బీహార్ రాజధాని పట్నాలో సమావేశమైంది. ఆ సమావేశానికి కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ, టీఎంసీ, శివసేన, డీఎంకే, సీపీఐ, సీపీఎం సహా మొత్తం 16 పార్టీలు హాజరయ్యాయి.
అనంతరం జూలై 17, 18 తేదీల్లో కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇండియా కూటమి రెండో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మొత్తం 26 ప్రతిపక్ష పార్టీలు హాజరయ్యాయి. కేవలం నెల రోజుల లోపే కూటిమి పార్టీల సంఖ్య మరో 10 పెరిగింది. రెండో సమావేశంలోనే ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి ‘INDIA’ గా నామకరణం చేశాయి. ఈ క్రమంలో ముంబైలో మూడో సమావేశం జరుగబోతున్నది.