పట్నా: నీట్ యూజీ పేపర్ లీకేజీతో అభాసుపాలై, యుద్ధ వాతావరణంలో రీఎగ్జామ్ నిర్వహించిన కేంద్రం.. పరీక్షలో అక్రమాలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోయింది. తన నిర్వహణా వైఫల్యాన్ని మరోసారి బయటపెట్టుకుంది. నీట్-యూజీ రీ టెస్ట్ సందర్భంగా బీహార్‌లోని లఖిసరాయ్‌లో జరిగిన ఓ మోసాన్ని పోలీసులు ఛేదించారు. నిజమైన అభ్యర్థుల తరపున ఈ ప్రవేశ పరీక్షను రాయడానికి ఒక ముఠా ‘పరిష్కారకులను(సాల్వర్స్)’ ఏర్పాటు చేసిందని పోలీసులు తెలిపారు. ఇది సంజయ్ దత్ నటించిన మున్నా భాయ్ ఎంబీబీఎస్ సినిమాలో చూపిన మోసాన్ని పోలి ఉంది. పోలీసులు అరెస్ట్ చేసిన 24 మంది సభ్యుల ముఠాలో వైద్య విద్యార్థులు, ఓ బయో మెట్రిక్ కంపెనీ ఉద్యోగులు ఉన్నారు. ఇందులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అర్పిత్ రాజ్‌ను 2024 నీట్-పీజీ లీకేజీ కేసులో సీబీఐ ప్రశ్నించింది.
మయాంక్ కశ్యప్ అనే నిందితుడు బయో మెట్రిక్ కంపెనీ ఉద్యోగిగా నటిస్తూ హసన్పూర్ హైస్కూల్ పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించడంతో పోలీసులకు అనుమానం వచ్చి అతడిని అదుపులోకి తీసుకోవడంతో ఈ మోసం బయటపడింది. తర్వాత లఖిసరాయ్‌లోని రెండు పరీక్ష కేంద్రాల్లో పోలీసులు తనిఖీ చేసి ఏడుగురు అభ్యర్థులను, ఇతర నిందితులను అరెస్ట్ చేశారు. అసలు అభ్యర్థుల తరపున పరీక్ష రాస్తున్న కొందరు వైద్య విద్యార్థులు ఇందులో ఉన్నారు. వైద్య విద్య ప్రవేశ పరీక్షలు జరిగేటప్పుడు వైద్య విద్యార్థులు కళాశాలను వదిలి బయటకు వెళ్లకూడదన్న ఆంక్షలను పలువురు ఉల్లంఘిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఆదివారం నీట్-యూజీ రీ టెస్ట్ సందర్భంగా కొత్త రాజకీయ వివాదం చెలరేగింది. బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ కారణంగా తాము పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా చేరుకొన్నామని పలువురు విద్యార్థులు ఆరోపించారు. దీనిపై ఒక విద్యార్థి తండ్రి స్పందిస్తూ.. ‘ఇవాళ నీట్ పరీక్ష ఉందని దేశంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. అయినా కాంగ్రెస్ పార్టీ ప్యాలెస్ గ్రౌండ్లో ర్యాలీ నిర్వహించింది. దీని వల్ల ఇక్కడ గత మూడు గంటల నుంచి రోడ్లు దిగ్బంధం చేశారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ కోటా వెళ్లి విద్యార్థులకు మద్దతుగా ర్యాలీ నిర్వహిస్తారని.. కానీ వాళ్ల పార్టీ ర్యాలీ ఇక్కడ విద్యార్థులకు ఆటంకం కలిగించిందని విమర్శించారు. ఈ ఘటనలపై బీజేపీ రాజ్యసభ ఎంపీ, అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి అన్నిటికంటే రాజకీయాలే ముఖ్యమని, విద్యార్థుల పట్ల ఆ పార్టీకి ఉన్న శ్రద్ధ తక్కువన్న విషయాన్ని తెలియజేస్తున్నాయని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది.